
Ather New Launch: దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో గుర్తింపు పొందిన ఏథర్ ఎనర్జీ ఇకపై సామాన్య మధ్యతరగతి ఈవీ లవర్స్ కి చేరువ కావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ తాజాగా "EL" అనే కొత్త ఆఫోర్డబుల్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన మొదటి స్కూటర్‌ను ఏథర్ 2026 పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి తీసుకొస్తోంది.
EL ప్లాట్‌ఫారమ్ అనేది ఏథర్ ఎనర్జీ ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత వర్సటైల్, స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్ అని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పై కమ్యూటర్ స్కూటర్లు, ఫ్యామిలీ స్కూటర్లతో పాటు ఇతర హై-పర్ఫార్మెన్స్ మోడల్స్ కూడా నిర్మించవచ్చని కంపెనీ చెబుతోంది. EL మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి కోసం కంపెనీ ఔరంగాబాద్‌లో కొత్త ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అందుబాటు ధరల్లో స్కూటర్లు దేశీయ మార్కెట్లోకి తీసుకురావాలని తద్వారా 20 శాతం మార్కెట్ షేర్ కొల్లగొట్టాలని చూస్తోంది.
ప్రస్తుతం కంపెనీ 2018లో లాంచ్ చేసిన పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్కూటర్ Ather 450X, 2024 నుంచి డెలివరీలు అందిస్తున్న ఫ్యామిలీ ఈవీ స్కూటర్ Ather Rizta మోడళ్లను దేశీయ మార్కెట్లో అమ్ముతోంది ఏథర్. అయితే ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం లక్ష రూపాయల కంటే ఎక్కువ రేటుతో కొనసాగుతున్నాయి. ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేసి ఈ మోడళ్లను కంపెనీ ఇప్పటి వరకు లాంచ్ చేయగా.. రానున్న కాలంలో అఫోర్డబుల్ మోడల్స్ అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది ఈవీ దిగ్గజం.
విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీ దేశవ్యాప్తంగా తన ప్రెజెన్స్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు 446 ఫిజికల్ స్టోర్స్ కంపెనీకి ఉండగా ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను 700కి చేర్చాలని నిర్ణయించింది. దక్షిణ భారతదేశంలో ఏథర్ ఇప్పటికే నంబర్ వన్ బ్రాండ్ కాగా.. ఇకపై నార్త్, సెంట్రల్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త స్కూటర్ వచ్చేలోపు.. కంపెనీ కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రోల్ అవుట్ ప్రారంభించింది.
దేశంలోని దిగ్గజ టూవీలర్లు అయిన బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ వాహనాలను లక్ష కంటే తక్కువ రేటులో అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉండగా.. పోటీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఏథర్ ఎనర్జీ కూడా ప్రయత్నిస్తోంది. Rizta తెచ్చిన విజయంతో కంపెనీ మార్కెట్ షేర్ కూడా భారీగానే ఏడాది కాలంలో పెరిగింది. మెుత్తానికి కంపెనీ తన EL ప్లట్‌ఫారమ్ పై నిర్మించిన మెుదటి అఫోర్డబుల్ ఈవీ స్కూటర్ 2026లో మొదటిసారి ఆటో లవర్స్ ముందుకుతీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.