
ఇరవై ఏళ్ల క్రితం స్వయంవరం, చిరు నవ్వుతో లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన వేణు తొట్టెంపూడి .. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించారు.
శుక్రవారం ఈ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యాలంటే ఎలా అని ప్రశ్నిస్తాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని తన మిత్రుడు చెప్పినా నమ్మడు. కానీ ఆ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు?, మనిషా, దెయ్యమా? ఎందుకు వింతగా ప్రవర్తిస్తుందనేది ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు.
కొన్ని కథలు మొదలుపెట్టడం సులువు, ముగించడం కష్టం, కథలకు ముగింపు ఇద్దామా అనే డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.