
- ఇయ్యాల్టితో నేషనల్ అథ్లెటిక్స్ ముగింపు
హనుమకొండ, వెలుగు: ఐదో నేషనల్ ఛాంపియన్ షిప్- పోటీల్లో అథ్లెట్స్ హోరాహోరీగా తలపడ్డారు. హనుమకొండ నెహ్రూ స్టేడియంలో రెండో రోజు శుక్రవారం పోటీలు కొనసాగాయి. 31 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా, ఇందులో 13 ఫైనల్స్ జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు సత్తా చాటారు. 20 కి.మీ వాక్ రేస్ మెన్స్ పోటీలో ఆర్మీ వింగ్ నుంచి సచిన్ బోరా గోల్డ్ మెడల్ సాధించారు.
1500 మీ మెన్స్ రన్ పోటీలో ప్రభుజోత్ సింగ్(పంజాబ్) , మెన్స్ డిస్కస్ త్రోలో ఉజ్వల్(జేఎస్ డబ్ల్యూ), 110 మీ హర్డిల్స్ మెన్స్ పోటీలో క్రిషిక్(ఐవోసీఎల్), 400 మీటర్ రన్ మెన్స్ పోటీల్లో పోలీస్ స్పోర్ట్స్ అథ్లెట్ తరణ్ దీప్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచారు. 1500 మీ డెకథ్లాన్ రన్ లో కుషాల్ కుమార్(మహారాష్ట్ర), మెన్స్ షాట్ పుట్ లో అతుల్(రిలయన్స్) మెడల్స్ పొందారు. లాంగ్ జంప్ లో కేరళ నుంచి అనురాగ్, హైజంప్ లో హరియాణా నుంచి శివ్ భగవాన్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
అదేవిధంగా 20 కి.మీ రేస్ వాక్ విమెన్స్ పోటీలో రాజస్థాన్ కు చెందిన మహిమా చౌదరి, 100 మీ హర్డిల్స్ విమెన్స్ పోటీలో ప్రాంజలి పాటిల్(జేఎస్ డబ్ల్యూ), 400 మీటర్ల రన్ విమెన్స్ పోటీలో యూపీకి చెందిన ఆయుషీ, పోల్ వాల్ట్ లో తమిళనాడు అథ్లెట్ కార్తీకకు గోల్డ్ మెడల్స్ దక్కాయి. వివిధ క్రీడాంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెడల్స్ ప్రదానం చేశారు. శనివారం చివరిరోజు పోటీల్లో మెన్స్, విమెన్స్ విభాగాల్లో 22 ఈవెంట్లతో పాటు ఫైనల్స్ కూడా జరుగుతాయి. అనంతరం నిర్వాహకులు ఓవరాల్ ఛాంపియన్ ను ప్రకటిస్తారు.