ఇండియా స్టార్‌‌ అథ్లెట్‌‌ జ్యోతికి మోకాలి గాయం

ఇండియా స్టార్‌‌ అథ్లెట్‌‌  జ్యోతికి మోకాలి గాయం

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ అథ్లెట్‌‌ ఎర్రాజీ జ్యోతి మోకాలికి గాయమైంది. కొన్ని రోజుల కిందట ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో ఆమె గాయపడటంతో ప్రస్తుతం ట్రెయినింగ్‌‌ను ఆపేసింది. దీంతో సెప్టెంబర్‌‌లో జరిగే టోక్యో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఆమె బరిలోకి దిగడంపై సందిగ్ధత నెలకొంది. ‘కొన్ని రోజుల కిందట శిక్షణలో నా మోకాలికి గాయమైంది. దాని కారణంగా ఈ సీజన్‌‌ను ఆపేయాల్సి వచ్చింది. నా మోకాలి పరిస్థితిపై డాక్టర్లతో కలిసి చర్చిస్తున్నా. మరింత స్పష్టత వచ్చిన తర్వాత టోర్నీలపై తుది నిర్ణయానికి వస్తాం’ అని జ్యోతి పేర్కొంది.

 100 మీటర్ల హర్డిల్స్‌‌లో నేషనల్‌‌ రికార్డు హోల్డర్‌‌ (12.78 సెకన్లు) అయిన జ్యోతి మోకాలి గాయం పరిస్థితి విచిత్రంగా ఉందని ఆమె కోచ్‌‌ జేమ్స్‌‌ హిల్లియర్‌‌ కూడా వెల్లడించాడు. టోక్యో చాంపియన్‌‌షిప్‌‌కు జ్యోతి ఇంకా అర్హత సాధించకపోయినా, మే నెలలో జరిగిన ఆసియా చాంపియన్‌‌షిప్‌‌లో 12.96 సెకన్ల టైమింగ్‌‌తో స్వర్ణం నెగ్గింది. ఈ ర్యాంకింగ్స్‌‌ ద్వారా ఆమె వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌కు అర్హత సాధించొచ్చనే నమ్మకంతో ఉంది. వరల్డ్‌‌ ర్యాంకింగ్ ద్వారా చాంపియన్‌‌షిప్‌‌కు చేరుకునే వారిలో జ్యోతి 12వ ప్లేస్‌‌లో ఉంది. రాబోయే ఈవెంట్లలో పోటీ చేయడం ద్వారా డైరెక్టర్‌‌గా చాంపియన్‌‌షిప్‌‌కు క్వాలిఫై కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గాయం వల్ల ఆమె అందుబాటులో ఉండటం కష్టంగా మారింది.