ఆత్మనిర్భర్ భారత్ సాంస్కృతిక వైభవం : నరహరి వేణుగోపాల్ రెడ్డి

ఆత్మనిర్భర్ భారత్ సాంస్కృతిక వైభవం : నరహరి వేణుగోపాల్ రెడ్డి

ఒ క ప్రాదేశిక భౌగోళిక స్వరూపం లేకుండా జాతీయ సాంస్కృతిక విలువలు నిలుపుకోలేం. మన జాతీయ భావన విశ్వ భావన నుంచే ఆవిర్భవించింది. నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నేషన్ బిల్డింగ్(జాతి నిర్మాణం) విధానం మాత్రమే ఆచరిస్తున్నది. కేవలం ఎన్నికల సంతుష్టీకరణపై దేశ అభివృద్ధి ఆధారపడదని, మన పూర్వుల వారసత్వం పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలనేదే ప్రధాని నినాదం. ప్రకృతి వనరులను కాపాడుకుంటూ జీవించే వాతావరణం సృష్టించుకొని సత్యం, అహింసలు ఆదర్శంగా జీవించడమే నిజమైన సాంస్కృతిక వైభవం. ఇదే పరంపర వారసత్వంగానే మన రాజ్యాంగ నిర్మాణం జరిగింది.

మార్క్స్ ముల్లర్ ను పాశ్చాత్యుల జాతుల మేధాశక్తి అంటారు. ఇతను ఒక సందర్భంలో ‘మనుషుల ఆంతరంగిక జీవితం దోషరహితమై, పరిపూర్ణమైన మానవత్వంతో శాశ్వతత్వం కోసం ప్రయత్నం చేయాలి. ప్రపంచ మానవాళికి భారతదేశమే సరైన ప్రదేశం’ అని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా తన సామ్రాజ్యవాదం పక్కన పెట్టి, తమ జాతీయ పురుషుల ప్రేరణతోనే యుద్ధం చేశారు. హిట్లర్ ట్యాంకులను సమర్థంగా ఎదుర్కొన్నారు.

భారత్ బహుళత్వాన్ని ప్రేమిస్తుంది. బహుళత్వాన్ని ప్రేమించని మతాలు సెక్యూలరిజాన్ని ప్రేమించలేవు. భారతీయ సాంస్కృతిక వారసత్వంలో మత రాజ్యాలకు స్థానం లేదు. స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస అని భారతీయ భావన. ఇది భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే మన బలం. కొందరు పాశ్చాత్యులు దీన్ని బలహీనతగా భావించి మన దేశంపైకి వచ్చి ఆర్థిక దోపిడీ, రాజకీయ నియంతృత్వాన్ని చెలాయించారు.

దేశ ప్రయోజనాల కోసం..

శాస్త్రీయత, ఆధ్యాత్మిక రంగం విశ్వజనీనమైనవి. యోగా ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది విశ్వశక్తుల కలయిక అని మనం ప్రపంచానికి చాటిచెప్పాం. తద్వారా అనేక దేశాలను యోగా ఆచరించే విధంగా ఒప్పించి విశ్వవ్యాప్తం చేశాం. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనేక దేశాలు తమ తమ విద్యావిధానంలో ప్రవేశపెడుతున్నాయి. ఉదాహరణకు ఇరాన్ తమ యూనివర్సిటీలో ఉపనిషత్తులను పాఠ్యాంశంగా పెట్టింది. నేడు భారత్ లోని విద్యావిధానంలో మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు ప్రవేశపెట్టాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారు.

వీటిని విశ్వవ్యాప్తం చేయాలన్న ప్రయత్నం కొనసాగుతున్నది. మన ప్రధాని ఏ దేశం వెళ్లినా ఆ దేశం నేతలకు భగవద్గీతను బహుమానంగా ఇస్తున్నారు. ఈ దేశంలో విదేశీ దాడుల్లో కూలిన దేవాలయాల అస్తిత్వాన్ని పునరుద్ధరిస్తున్నారు. అందులో భాగంగానే చట్టబద్ధంగా రామాలయ నిర్మాణం జరిగేటట్లు విజయం సాధించారు. గంగా, యమున నదులను ప్రక్షాళన చేస్తున్నారు. ప్రయాగ కుంభమేళాలో చివరి రోజు గంగా నదిలో స్నానం ఆచరించి, సఫాయి కర్మచారుల పాదప్రక్షాళన చేసి, వీరే నా దేశ వారసత్వ సంపద అని చాటిచెప్పారు. మన పురాణాల్లో కృష్ణుడు కుచేలుడి కాళ్లు కడిగిన ఉదాహరణ దీనికి సరిపోతుంది.

దేశంలో నలందా విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. నరేంద్ర మోడీ సొంత అవసరాలు తగ్గించుకొని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం జీవిస్తున్నారు. దీన్ని మన ఋషులు నిజమైన తపస్సు అని నిర్వచించారు. సత్యాన్ని దర్శించిన వారికి ఫిలాసఫీ అవసరం లేదు. అందుకే మన ఋషులు ఎప్పుడు కూడా ఫిలాసఫీని ఆవిష్కరించలేదు. ఇదే భారతీయ సాంస్కృతిక వైభవం.

స్వయం సమృద్ధ భారత్

మన ఋషులు రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధానికే విలువనిచ్చారు. విదేశీయులు ఏ అంశాలను, ఏయే రంగాలను నాశనం చేశారో, నేడు మన దేశ ప్రధాని వాటిని పునర్నిర్మించి, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతున్నారు. నీకు మట్టి ముద్ద కావాలా... బంగారు ముద్ద కావాలా... అని అడిగితే నాకు మట్టి ముద్దే శ్రేష్టం అని, నా దేశ ప్రజలు మట్టి మనుషులుగా జీవిస్తున్నారని ఇదే నిజమైన సనాతన, స్వయం సమృద్ధ భారత్ అని చాటిచెప్తున్నారు ఆయన.

వారణాసి ఒక శక్తి కేంద్రం. ఆ శక్తి కేంద్రమే ఈరోజు130 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరేవిధంగా, ప్రపంచంలో సగౌరవంగా తలెత్తుకునే విధంగా నరేంద్ర మోడీని నడిపిస్తూ ఉన్నది. యోగా, తపస్సు, మన ఇతిహాసాలు, పండుగలు, సంగీతం, సాహిత్యం, కళలు, ప్రకృతి ఆరాధన, కుటుంబ జీవనం మొదలైన వాటికి విలువనిస్తూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్తున్నారు. ఆధ్యాత్మిక, భౌతిక శక్తి కలిసి సమన్వయంతో పని చేస్తేనే విజయం సాధిస్తామన్న పరిజ్ఞానంతో భారత ప్రభుత్వం ముందుకు పోతున్నది.

సనాతన ధర్మం.. వైదిక ధర్మం

భారత్​లో ధర్మబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా) తేవాలని1950లో భారతీయ జనసంఘ్ తీర్మానించింది. ఆ పునాది మీదనే ఈరోజు భారత ప్రభుత్వం నడుస్తున్నది. భారతీయ ఋషులు విశ్వజనీన శక్తిని తమ తపో సాధన ద్వారా హేతుబద్ధంగా దర్శించారు. ఈ విశ్వంలో విశ్వశక్తి ఒకటే అని దార్శనికంగా అనుభవించారు. అందుకే “సత్యమేవ జయతే” అన్నారు. విశ్వశక్తి ఒకటే అని నమ్మే భారతీయులు అందరిలో ఆంతరిక శక్తి ఒకటే అనే భావన వ్యక్తపరిచారు.

అదే వసుదైక కుటుంబం అని ప్రపంచ దేశాల్లో మోడీ తెలియజేస్తున్నారు. భారత్ ప్రాకృతిక వైవిధ్యంలో సామరస్యాన్ని కాపాడుకుంటూ ఆంతరిక ఏకత్వాన్ని చాటిచెప్తున్నది. ఇదే భిన్నత్వంలో ఏకత్వం. కానీ దైవం మూలం తెలియనివారు మత మార్పిడులు చేస్తూ రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. భౌతిక వైవిధ్యాన్ని చెరపకుండా ఆంతరిక ఏకత్వం సాధించడమే స్వయం సమృద్ధ సాంస్కృతిక భారత్ అంటారు. సనాతన ధర్మం, వైదిక ధర్మం ప్రతిరూపమే హిందూ ధర్మం. భౌతిక, ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే వ్యవస్థే హిందూ జీవన విధానం.

హిందూత్వంలో చొరబడే వికృతులను కారణ జన్ములు ఎప్పటికప్పుడు సంస్కరిస్తూ వస్తున్నారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మత మార్పిడులు చేయలేదు. ప్రపంచంలో బౌద్ధం నిరాపేక్ష భావం, సనాతన ధర్మం ఏకాత్మ భావం చాటి చెప్పారు. విదేశీ మతాలు దీన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని బలహీనంగా భావించి ఆర్థికంగా, రాజకీయంగా మనపై ఆధిపత్యం చెలాయించి, వారి భౌతిక సుఖాలకు పరిమితమై పతనమయ్యారు.  - నరహరి వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు