
ముచ్చటగా మూడు పదుల వయసులో.. ముగ్గురు పిల్లల సంతానంతో.. సంతోషంగా సాగాల్సిన ఓ వివాహిత జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చడం బాలాపూర్ లో విషాదాన్ని నింపింది. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరారైన ఘటన హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. నగర శివారు ప్రాంతం లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ గ్రీన్ సిటీ లో జాకీర్ అహ్మద్ (31), నజియా భేగం (30) నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. గతంలో గోల్కొండ ప్రాంతం లో ఉండేవారని.. ఇటీవలే బాలాపూర్ కు మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోకల్ గా ఉండే సిరాజ్ అనే ఇండ్ల బ్రోకర్ జాకీర్ కుటుంబానికి అద్దె ఇల్లు ఇప్పించినట్లు చెప్పారు.
గత కొద్ది రోజులుగా నజియాకు అక్రమ సంబంధం ఉందని భార్య పై అనుమానం పెంచుకున్నాడు జాకీర్ . మంగళవారం (మే 13) రాత్రి ఈ అంశంపై ఇద్దరి మధ్య జరిగిన గొడవలో.. భార్యను కట్టెతో కొట్టి, గొంతు నులిమి.. గాజు పెంకుతో కోసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
మంగళవారం (మే 13) రాత్రి హత్య చేసి ఉదయం (బుధవారం) అత్త రుబీనాకు చెప్పి పారిపోయాడు జాకీర్. మృతురాలి తల్లి రుబీన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నజియా బేగం ఈవెంట్ లలో పని చేస్తున్నట్లు తెలిసింది.