పోలీసులపై బీఆర్ఎస్ నేతల దాడి .. 17 మందిపై కేసు..  బెల్లంపల్లిలో ఘటన

పోలీసులపై బీఆర్ఎస్ నేతల దాడి .. 17 మందిపై కేసు..  బెల్లంపల్లిలో ఘటన

బెల్లంపల్లి రూరల్, వెలుగు: రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీఆర్ఎస్​నేతలు దాడి చేశారు. ఈ ఘటన బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగింది. కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన ఎల్లాకుల మల్లేశ్ కు, ఆ గ్రామ సర్పంచ్​జిల్లెల అశోక్​గౌడ్​కు మధ్య గత ఆదివారం గొడవ జరిగింది. దీంతో బుధవారం రాత్రి సర్పంచ్​కొడుకు మహేశ్ గౌడ్(బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు), మరో నేత కాసారపు శ్రీనివాస్ కలిసి మల్లేశ్ పై దాడి చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు.

ఆ సమయంలో మల్లేశ్ ఇంట్లో లేకపోవడంతో అతడి​భార్య సత్తక్కపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు100కు సమాచారం ఇవ్వగా.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు, కానిస్టేబుల్ తులసీరాం ఘటనా స్థలానికి వెళ్లారు. వివరాలు తెలుసుకుని గొడవ పెట్టుకోవద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీఆర్ఎస్ నేతలకు చెప్పారు. అయినా వెళ్లకపోవడంతో పోలీసులు వాళ్లను వీడియో తీశారు. దీంతో ఎందుకు వీడియో తీస్తున్నారంటూ పోలీసుల సెల్ ఫోన్ గుంజుకున్న నేతలు.. బైక్ తాళం కూడా తీసుకొని దుర్భాషలాడారు.

అంతలోపే సర్పంచ్​ అశోక్​గౌడ్,​ మరో 15 మంది అక్కడికి చేరుకొని పోలీసులపై దాడికి పాల్పడ్డారు. సర్పంచ్, ఆయన కొడుకు మహేశ్ గౌడ్, మరో 15 మందిపై కన్నెపల్లి పోలీస్ స్టేషనల్​లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాండూర్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ ​నేతలు మహేశ్ గౌడ్, కాసారపు శ్రీనివాస్​పై మల్లేశ్ భార్య సత్తక్క చేసిన ఫిర్యాదుతో మరో కేసు పెట్టినట్టు కన్నెపల్లి ఎస్ఐ నరేశ్ తెలిపారు.