
- బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన 30 మంది
- గన్‌మెన్ల వద్ద గన్స్లాక్కొనేందుకు ప్రయత్నం
- కారు అద్దాలు దింపాలని గొడవ.. గన్‌మెన్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
- ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
- శ్రీగణేశ్‌కు ఫోన్‌చేసి.. వివరాలు ఆరా తీసిన సీఎం రేవంత్
ఓయూ, వెలుగు: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్‌నగర్‌లో బోనాల వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా 30 మంది యువకులు అడ్డగించారు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించగా, గన్‌మెన్లు అడ్డుకున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కంప్లయింట్ చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
డీసీపీ బాలస్వామి కథనం ప్రకారం.. 10 బైక్‌లపై30 మంది గుర్తు తెలియని వ్యక్తులు ట్రిపుల్‌రైడింగ్ చేస్తూ ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా వచ్చారు. దీంతో ఎమ్మెల్యే డ్రైవర్ హారన్ కొట్టడంతో వారు తమ బండ్లను రోడ్డుపై అడ్డంగా నిలిపి.. తిరగబడ్డారు. కారు అద్దాలు దింపాలని గొడవ చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడికి యత్నించారు. గన్‌మెన్లు కిందకు దిగగానే వారి వద్ద ఉన్న గన్స్ లాక్కునేందుకు యత్నించారు. గన్‌మెన్స్ వారిని తోసేయగా.. వెహికల్స్‌పై విద్యానగర్ వైపు వెళ్లిపోయారు.
దీంతో ఎమ్మెల్యే ఓయూ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ యువకులు దాడి చేసేందుకు వచ్చారని కంప్లయింట్లో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌పై అటాక్ చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకోసం మూడు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు డీసీపీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడికి యత్నం జరిగిందని తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారు. శ్రీ గణేశ్‌కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.