
- ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్‌లో అనేక మంది మృతి
- హమాస్ టార్గెట్‌గానే దాడులు చేశామన్న ఇజ్రాయెల్
- మిలిటెంట్ కమాండర్‌ను మట్టుబెట్టినట్లు ప్రకటన
గాజా/జెరూసలెం: హమాస్ మిలిటెంట్ సంస్థను నామరూపాల్లేకుండా చేస్తామంటూ భీకర దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ వరుసగా రెండో రోజూ గాజా సిటీ సమీపం లోని రెఫ్యూజీ క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మంగళవారం గాజా స్ట్రిప్ లోని అతిపెద్దదైన జబాలియా రెఫ్యూజీ క్యాంపుపై బాంబుదాడులు చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 7నాటి నరమేధం వెనక కీలక పాత్ర పోషించిన హమాస్ కమాండర్‌ను హతమార్చామని ప్రకటించింది. ఈ దాడిలో 47 మంది చనిపోయారని తెలిపింది. రెఫ్యూజీ క్యాంపు వద్ద ఉన్న హమాస్ టన్నెల్ కాంప్లెక్స్ పైనే తాము ఎయిర్ స్ట్రైక్స్ చేశామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ దాడిలో హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీతో సహా పలువురు మిలిటెంట్లు హతమయ్యారని పేర్కొంది. అయితే, తమ లీడర్లు ఎవరూ ఆ క్యాంపు వద్ద లేరని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడి వల్ల జబాలియా రెఫ్యూజీ క్యాంపులో 50 మందికిపైగా చనిపోయారని, 150 మంది గాయపడ్డారని హమాస్ వెల్లడించింది. ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు బుధవారం కూడా గాజా సిటీ సమీపంలోని మరో రెఫ్యూజీ క్యాంపు ఉన్న అపార్ట్ మెంట్ బిల్డింగులపై బాంబుదాడులు చేశాయని ప్రకటించింది. అయితే, బుధవారం నాటి దాడుల్లో ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారన్నది వెల్లడికాలేదు. కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్లకు చెందిన 11 వేల టార్గెట్లను ధ్వంసం చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. గాజాను ఇజ్రాయెల్ బలగాలకు శ్మశానవాటికగా మారుస్తామంటూ హమాస్ మిలిటరీ వింగ్ అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ మరోసారి హెచ్చరించింది. గాజా స్ట్రిప్ లో మరోసారి ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ సర్వీసులు కట్ అయ్యాయని పాలస్తీనియన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వెల్లడించింది. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.
ఈజిప్టులోకి ఫారినర్లు
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజా స్ట్రిప్ లో చిక్కుకుపోయిన విదేశీయులు తొలిసారిగా రఫా క్రాసింగ్ వద్ద బార్డర్ దాటి ఈజిప్టుకు చేరుకుంటున్నారు. విదేశీయుల కోసం రఫా క్రాసింగ్ వద్ద బార్డర్ ను ఈజిప్టు తొలిసారిగా బుధవారం ఓపెన్ చేసింది. దీంతో ఫారిన్ వీసాలను కలిగి ఉన్న 400 మంది విదేశీయులు బార్డర్ దాటి ఈజిప్టులోకి ప్రవేశించారు. ప్రస్తుతం గాజాలో 44 దేశాలకు చెందిన పౌరులు, ఐక్యరాజ్యసమితి సహా 28 సంస్థలకు చెందిన వందలాది మంది సిబ్బంది ఉన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్న పాలస్తీనియన్లను మాత్రమే తమ దేశంలోకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం రానిస్తామని ఈజిప్టు బుధవారం తెలిపింది. తొలి విడతలో 81 మందిని అనుమతిస్తామని పేర్కొంది. దీంతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా పాలస్తీనా అంబులెన్స్ లు ఈజిప్టులోకి ప్రవేశించేందుకు బార్డర్ వద్దకు చేరుకున్నాయి.
టెర్రరిజానికి లొంగిపొమ్మంటరా?: నెతన్యాహు
హమాస్‌ను అంతం చేసేదాకా దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి తేల్చిచెప్పారు. ‘‘కాల్పుల విరమణ పాటించాలని చెప్పడమంటే ఇజ్రాయెల్‌ను హమాస్ కు, టెర్రరిజానికి, అరాచకత్వానికి లొంగిపోవాలని అనడమే” అని అన్నారు.
గాజా పిల్లల శ్మశానంలా మారింది: యూఎన్
ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్ పిల్లల శ్మశానవాటికలా మారిపోతోందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మొదట్లో డజన్ల కొద్దీ పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత కేవలం పక్షం రోజుల్లోనే బాలల మరణాలు వందలు, వేలకు పెరిగాయి. గాజాలో పిల్లల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలుగుతోంది” అని పేర్కొంది.
జర్నలిస్ట్ ఫ్యామిలీలో 19 మంది మృతి
జబాలియా రెఫ్యూజీ క్యాంపుపై ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ మహ్మద్ అబూ అల్ ఖుమ్సన్ కుటుంబసభ్యులు, బంధువులు 19 మంది చనిపోయారని ఆ చానెల్ ప్రకటించింది. మృతుల్లో అల్ ఖుమ్సన్ తండ్రి, సోదరుడు, ఇద్దరు అక్కా చెల్లెల్లు, 8 మంది పిల్లలు, ఇతర బంధువులు ఉన్నారని తెలిపింది. అల్ ఖుమ్సన్ గాజాలోని అల్ జజీరా బ్యూరోలో బ్రాడ్ కాస్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని, ఇజ్రాయెల్ బలగాల ఊచకోత కారణంగా ఆయన కుటుంబం బలైపోయిందంటూ విచారం వ్యక్తం చేసింది. కాగా, ఇంతకుముందు ఇజ్రాయెల్ దాడుల్లో అల్ జజీరా చానెల్ కు చెందిన మరో జర్నలిస్ట్ భార్య, కొడుకు, కూతురు, మనవడు కూడా మృతిచెందారు.