ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాసుపత్రిపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం అర్భన్​ మండలం పుట్టకోట గ్రామానికి చెందిన బత్తుల వెంకటలక్ష్మి(25) సైనస్​తో బాధపడుతూ ఈ నెల 6న ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆపరేషన్​ చేయాలని చెప్పి అడ్మిట్​ చేసుకున్నారు. మంగళవారం ఆపరేషన్​ చేస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్​, బెడ్​లు, పూల కుండీలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ అంజనేయులు, సీఐ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. అనంతరం డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధపడుతున్నారు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీని ఎవరూ ఏమి చేయలేరని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు. మంగళవారం ఖమ్మంలో తన క్యాంపు ఆఫీస్​ను ప్రారంభించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్​ పార్టీయేనన్నారు. కాంగ్రెస్​ పార్టీకి అభిమానులు ఎక్కువని, గత పార్లమెంటు ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా 4 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ఖమ్మం, హైద్రాబాద్​ కల్చర్​ ఏమిటో బీజేపీకి తెలియదన్నారు. మత విద్వేషాలకు తావులేకుండా కాంగ్రెస్​ పరిపాలించిందని చెప్పారు. ఇక్రిశాట్​ లాంటి ప్రపంచస్ధాయి సంస్ధలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్​ పార్టీదేనని తెలిపారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు చేపట్టని విధంగా రాహూల్ గాంధీ భారత్​ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. డీమానిటైజేషన్, జీఎస్టీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో మంత్రులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, కొత్త బస్టాండ్​లో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలిచిన వారు గొర్రెల్లా అమ్ముడుబోయారని, వారు ఇప్పుడు బీఆర్ఎస్​లో ఎందుకు చేరామా అని భాదపడుతున్నారన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్ధానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామన్నారు. మానవతారాయ్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ మార్కెట్​ కమిటీ చైర్మెన్​ మానుకొండ రాధాకిశోర్, పగడాల మంజుల, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, దొబ్బల సౌజన్య, రాంమూర్తినాయక్, మద్ది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

దమ్మక్క మండపంలో రాపత్​ సేవ

భద్రాచలం, వెలుగు: అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీసీతారామచంద్రస్వామికి విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని దమ్మక్క మండపంలో రాపత్​ సేవ జరిగింది. సాయంత్రం రామయ్యకు ఆలయంలో దర్బారు సేవ నిర్వహించాక పల్లకీలో స్వామిని ఊరేగింపుగా పురుషోత్తపట్నం తీసుకెళ్లారు. దమ్మక్క మండపంలో గ్రామస్తుల సమక్షంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు దర్శనం కల్పించారు. తర్వాత స్వామి తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయానికి రాగా అక్కడ పూజలందుకుని, తిరువీధి సేవగా రాజవీధి మీదుగా ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు ఉదయం గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి అప్పాలు, తమలపాకుల మాలలు నివేదించారు. హనుమాన్​ చాలీసా పారాయణం జరిగింది. ప్రాకార  మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి నిత్య కల్యాణం నిర్వహించారు. 

ముగ్గురు దొంగల అరెస్ట్

రూ.16 లక్షల సొత్తు స్వాధీనం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ముగ్గురు దొంగలను అరెస్ట్​ చేసి రూ.16 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ​విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. మంగళవారం సీపీ ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూ గొల్లగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటేశ్, లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామానికి చెందిన నారసాని రమేశ్  ఇటీవల​ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో బంగారం షాపులో దొంగతనం చేసినట్లు చెప్పారు. వీరిని వీవీపాలెం వందనం క్రాస్​ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 23 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీశ్రీ సర్కిల్​ వద్ద రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్  మండలం భగత్​సింగ్​నగర్​కు చెందిన మనిగండ్ల విజయ్​కుమార్​ను అదుపులోకి తీసుకొని 97గ్రాముల బంగారం, 724 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జీడిమెట్ల, సత్తుపల్లి, కొత్తగూడెం, జడ్చర్ల, భువనగిరి, ఖమ్మం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. సీసీఎస్​ ఏసీపీ రవి, ఏసీపీ అంజనేయులు, బస్వారెడ్డి సీఐ పులిగిళ్ల నవీన్, మల్లయ్యస్వామి, రూరల్​ సీఐ శ్రీనివాసరావు, అర్బన్​ సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.

నష్టపోని ప్రాంతాలకు వరద నిధులు

అధికారుల తీరుపై ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా అభివృద్దే లక్ష్యంగా అధికారులంతా పని చేయాలని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య సూచించారు. జడ్పీ ఆఫీస్ లో మంగళవారం జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఫ్లడ్​ డ్యామేజ్​ ఫండ్స్​ రూ.10 కోట్లు రిలీజ్​ అయితే  రూ.8 కోట్ల వరకు వరద ముంపు లేని ప్రాంతాలకు కేటాయించడంపై జడ్పీటీసీలు పోషం నర్సింహారావు, శ్రీలత, తెల్లం సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో భారీగా వరద నష్టం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే ఇంజనీరింగ్​ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి తమకు ఇష్టమున్న చోట్ల పనులు చేయడం సరైంది కాదన్నారు. ఫ్లడ్​ డ్యామేజ్​ ఫండ్స్​ను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన ఇంజనీరింగ్​ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు పోడుభూముల పట్టాల కోసం తమ పిల్లల పేరుతో దరఖాస్తు చేసుకుంటే, 2005 నాటికి 20 ఏండ్లు కాలేదంటూ రిజెక్ట్​ చేస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, జడ్పీ సీఈవో విద్యాలత పాల్గొన్నారు. 

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

నేలకొండపల్లి, వెలుగు: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఆల్ పెన్షనర్  అండ్  రిటైర్డ్  పర్సన్స్  అసోసియేషన్  పాలేరు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఏటుకూరి రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్టీవో, తహసీల్దార్  ఆఫీసుల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ అందించాలని, నాలుగో పీఆర్సీ పెండింగ్  జీవోలను వెంటనే విడుదల చేయాలని, మెడికల్ రీయింబర్స్​​మెంట్​ను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రాన్ని అందజేశారు. వల్లంచెట్ల భాస్కరరావు, చీట్ల భాస్కర్ రెడ్డి, సీతారాంరెడ్డి, రామలింగం, కె గోపాలకృష్ణమూర్తి, బండి రామ్మూర్తి, మంకెనపల్లి నరసింహారావు, ఎస్  జనార్ధన్, ఎం వెంకటేశ్వరరావు, ఆర్ చలపతిరావు, ఎస్కే బాషా, ఎం దుర్గారావు పాల్గొన్నారు.

భద్రాచలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి

భద్రాచలం, వెలుగు: జీవో నెంబరు 45ను అమలు చేస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు భద్రాచలం పంచాయతీలో ఎన్నికలు నిర్వహించాలని గోండ్వాన సంక్షేమ పరిషత్​ రాష్ట్ర కన్వీనర్​ సోంది వీరయ్య డిమాండ్​ చేశారు. మంగళవారం ఐటీడీఏ ఎదుటసంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు జీవో నెంబరు 45 వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఈ దీక్షకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి లేఖ రాస్తానని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఐటీడీఏ పీవో గౌతమ్​పోట్రును కలిసి సమస్యను వివరించారు. గిరిజన సంఘాల నేతలు కుంజా ధర్మా, చిచ్చడి శ్రీరామమూర్తి, వాసం రామకృష్ణ, పాయం సత్యనారాయణ, రిటైర్డ్  పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ కోట దేవదానం, చీమల నర్సింహారావు, సన్యాసి, సుభద్ర, గడ్డం వెంకన్న, కల్లూరి కొర్రాజు, రత్తమ్మ, కృష్ణ, భద్రమ్మ పాల్గొన్నారు.

అక్రమ మైనింగ్​పై తహసీల్దార్​ ఆగ్రహం

పెనుబల్లి, వెలుగు: మండలంలోని లింగగూడెం సమీపంలోని దేవతల గుట్టలో గిరిజనుల పేరుతో రెండు దశాబ్దాలుగా అక్రమ మైనింగ్​ జరుగుతుందనే ఫిర్యాదుతో మంగళవారం తహసీల్దార్​ రమాదేవి ​తనిఖీ చేశారు. మైనింగ్​ చేసిన తరువాత మట్టితో గుంతలు నింపి మొక్కలు నాటాల్సి ఉండగా, మట్టిని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టకు ఆనుకొని ఉన్న భూముల్లో పర్మిషన్​ లేకుండా వ్యర్థాలను వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనింగ్​ అనుమతులు, మిషనరీ వినియోగం, స్టాక్​ రిజిస్టర్​లను ఆఫీసులో అప్పగించాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఏజెన్సీ ఏరియాలో పీసా యాక్ట్​ను ఉల్లంఘిస్తూ మైనింగ్​ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.