సైనికులు ప్రార్థనలో ఉండగా మిలటరీ క్యాంప్ పై ఎటాక్..

సైనికులు ప్రార్థనలో ఉండగా మిలటరీ క్యాంప్ పై ఎటాక్..

యెమెన్​ మిలటరీ క్యాంపుపై మిసైల్​ ఎటాక్
83 మందికిపైగా సైనికులు మృతి.. 150 మందికి గాయాలు
క్యాంపులోని మసీదులో ప్రార్థన చేస్తుండగా దాడి
ఇది హుతి రెబల్స్ పనే: యెమెన్

దుబాయ్యెమెన్​లో హుతి రెబల్స్ బీభత్సం సృష్టించారు. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిసైల్ దాడి చేశారు. దీంతో 83 మంది వరకు సోల్జర్స్ చనిపోగా, 150 మందికి పైగా గాయపడ్డారు. గాయలపాలైన వారిని మారిబ్ సిటీలోని హాస్పిటల్​కు తరలించినట్లు యెమెన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి హుతి రెబల్స్‌‌ పనేనని ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. హుతి రెబల్స్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతమంది చనిపోయారనే దానిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రార్థన సమయంలో..

ఇరాన్ మద్దతు ఉన్న హుతిస్ కు, సౌదీ సపోర్టుతో నడుస్తున్న యెమెన్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో వార్ జరుగుతోంది. ఈ మధ్య రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. అయితే శుక్రవారం యెమెన్ క్యాపిటల్ సనాలోని నిహమ్ రీజియన్​లో హుతిస్​కు వ్యతిరేకంగా ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. అక్కడ ఫైటింగ్ ఇంకా కొనసాగుతోంది. పదుల సంఖ్యలో హుతి మిలీషియా సభ్యులు చనిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మారిబ్ సిటీలో మిలటరీ ట్రైనింగ్ క్యాంప్​లోని మసీదుపై హుతి మిలీషియా సభ్యులు ఎటాక్ చేశారు. ప్రార్థనల సమయంలో ఈ దాడి చేశారని అధికారులు చెప్పారు.

ఇరాన్ తొత్తులు

రెబల్స్ చేసిన దాడిని యెమెన్ ప్రెసిడెంట్ అబెడ్రబ్బో మన్సూర్ హాదీ ఖండించారు. మసీదుపై ఎటాక్ చేయడం పిరికిపందల చర్య అన్నారు. ‘‘హుతి మిలీషియా చేస్తున్న చర్యలు చూస్తే.. వారు శాంతిని ఇష్టపడటం లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే వారికి మరణం, విధ్వంసం తప్ప మరేమీ తెలియదు. ఈ ప్రాంతంలో ఇరాన్ కు తొత్తుగా పని చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. గతేడాది ఆగస్టులో మిలటరీ పరేడ్​పై హుతి రెబల్స్ చేసిన మిసైల్ దాడిలో 32 మందికిపైగా సోల్జర్స్ చనిపోయారు.

see also: మాకుగానీ ఓటుగానీ వేయకుంటే..