
- ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
- ఇటీవల దాడికి గురైన డ్రైవర్‌కు పరామర్శ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నిందితులపై పోలీస్ శాఖ సహకారంతో రౌడీ షీట్స్ తెరుస్తామని చెప్పారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ దారవత్ గణేశ్‌ను శనివారం ఆయన పరామర్శించారు.
గాయపడ్డ డ్రైవర్‌కు టీజీఎస్ ఆర్టీసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డ్రైవర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. శుక్రవారం అఫ్జల్‌గంజ్ నుంచి ఘట్‌కేసర్‌కు వెళ్తున్న రూట్ నంబర్ 231/1 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులోని డ్రైవర్ గణేశ్‌ను ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.
ఎలాంటి తప్పు లేకున్నా ఉస్మానియా యూనివర్సిటీ వై జంక్షన్ వద్ద బస్సును ఆపి.. డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో తిడుతూ, తీవ్రంగా కొట్టారన్నారు. దీంతో గణేశ్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారని సజ్జనార్ తెలిపారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే ఓయూ పోలీసులు స్పందించి, ఐదుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారని చెప్పారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించబోమన్నారు.