అవినీతి, ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే దాడులు

అవినీతి, ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే దాడులు

ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి దిగిన ఘటనలో గాయపడ్డ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లాఅధ్యక్షులు సామ రంగారెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు.  పెద్ద అంబర్ పేట లోని సామ రంగారెడ్డి నివాసానికి బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ తదితరులు వెళ్లారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ పలు కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి, ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్, ఎంఐఎం గూండాలు పోలీసుల  సమక్షంలొనే బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఏ సంస్థ పైన సోదాలు చేసినా ముఖ్యమంత్రి  కుటుంబం అవినీతి, అక్రమాలు బయటకు వస్తుండడంతో  వాటినుంచి దృష్టి మళ్లించేందుకు  దాడులకు, మత ఘర్షణలు జరిగేలా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ శ్రేణులపై దాడులు చేస్తే అదే స్థాయిలో తిప్పి కొడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 22న ఆమె ఇంటి వద్ద బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ నేతలు గాయపడ్డారు.