‘డబుల్ ​ఇండ్ల’ కోసం స్థలం గుంజుకున్నరని ఆత్మహత్యాయత్నం

‘డబుల్ ​ఇండ్ల’ కోసం స్థలం గుంజుకున్నరని ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన భూమిని డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం గుంజుకున్నారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్​లో ఆత్మహత్యకు యత్నించాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన జక్క మల్లేశం తండ్రికి గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నందుకు ప్రభుత్వం ఎకరం భూమి ఇచ్చింది. ఆ భూమిని డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసమంటూ అధికారులు లాక్కున్నారని కొంతకాలంగా మల్లేశం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.

సోమవారం కలెక్టరేట్ కు వచ్చిన మల్లేశం ఎవరూ న్యాయం చేయడం లేదంటూ తనతో తెచ్చుకున్న కిరోసిన్​ను ఒంటిపై పోసుకున్నాడు. అక్కడున్న కానిస్టేబుల్ గమనించి వెంటనే నీళ్లు పోసి అడ్డుకున్నాడు. గ్రామ సర్పంచుతో పాటు మరికొందరు తన భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేయడం వల్లే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు మల్లేశం చెప్పాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.