ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది. రాజధాని బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై తెల్లవారుజామున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌తో దాడి చేశారు. ముస్తఫాకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. అయితే తాను క్షేమంగానే ఉన్నానని.. దేశ ప్రజలంతా ప్రశాంతంగా, సంయమనంతో ఉండాలని కధిమి తన ట్విట్టర్లో సూచించారు.
ప్రధాని కధిమి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఇరాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కధిమి ఇంటి బయట ఉన్న రక్షణ దళానికి చెందిన ఆరుగురు సభ్యులు గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే బాగ్దాద్‌లోని పటిష్టమైన గ్రీన్జోన్లో ఉన్న ప్రధాని కధిమి నివాసంపై దాడికి పాల్పడింది ఏ గ్రూపు అనే విషయం ఇంకా తెలియలేదు.