
- మోదీ, ట్రంప్ మాస్కులతో ఏఐవైఎఫ్ నేతల ర్యాలీ
- అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
బషీర్బాగ్, వెలుగు: దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ అమెరికన్ కాన్సులేట్ ముట్టడికి ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీసు నుంచి వినూత్న రీతిలో ట్రంప్, మోదీ మాస్క్ లతో నేతలు ర్యాలీ తీశారు.
భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుర్మార్గ చర్యలు ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని నినదించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నాయకులను అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్, నారాయణగూడ పీఎస్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడారు. ఉగ్రవాద ప్రేరేపిత దేశం పాకిస్తాన్ కు అమెరికా రెడ్ కార్పెట్ వేస్తూ సామ్రాజ్యవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ చెప్పినా మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అమెరికాలోని వైట్ హౌస్ లో ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ను ఆహ్వానించిన సందర్భంలోనే మోదీని ఆహ్వానిస్తే హాజరుకావడం దేశాన్ని అవమానించడమేన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సల్మాన్ బేగ్, ఎండీ. కుతుబ్, రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్ అలీ ఖాన్, శేఖర్, కల్యాణ్, నాగరాజు, మోసిన్ ఖాన్, మధుకర్, మధు, సునీల్ పాల్గొన్నారు.