
హైదరాబాద్, వెలుగు: అమెరికాలో తయారీకి ఉన్న అవకాశాలు, సవాళ్లపై అంశంపై చర్చించడానికి యూఎస్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఐకాన్.. సీఐఐ తెలంగాణతో కలిసి ఫార్మికాన్ పేరుతో హైదరాబాద్‌లో గురువారం సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో పరిశ్రమ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వాణిజ్య వాటాదారులు పాల్గొన్నారు.
సీఐఐ తెలంగాణ మాజీ చైర్మన్ సంజయ్ సింగ్, సీఐఐ తెలంగాణ ఫార్మా లైఫ్ సైన్సెస్ ప్యానల్ కన్వీనర్, ఎకోబ్లిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ, సీఈఓ చక్రవర్తి ఏవీపీఎస్ మాట్లాడుతూ... భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్లో పోటీపడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఐకాన్ సీఈఓ భుపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ఫార్మా, బయోటెక్ కంపెనీలకు అమెరికాలో అత్యాధునిక, తక్కువ ఖర్చుతో కూడిన సదుపాయాలను నిర్మించడానికి ఐకాన్ కట్టుబడి ఉందన్నారు. నిర్మాణ రంగంలో తమకు 30 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. 200కు పైగా సైట్లలో 300 మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు.
తెలంగాణ లైఫ్‌సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్ (మెడికల్ డివైసెస్ - పాలసీ ఇన్వెస్ట్మెంట్స్) వేణుగోపాల్ రావు సంకినేని మాట్లాడుతూ ప్రపంచస్థాయి ఫార్మా ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా ఎదిగిందని చెప్పారు.