ప్రతాపరుద్రుని కోటలో గుప్తనిధుల తవ్వకాలు

ప్రతాపరుద్రుని కోటలో గుప్తనిధుల తవ్వకాలు

నిందితుల్లో టీఆర్ఎస్​ లీడర్, టీచర్​

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్ ​జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని ప్రతాపరుద్రుని కోటలో గుప్త నిధుల కోసం ప్రయత్నాలు జరిగినట్లు మన్ననూర్ ఫారెస్ట్  రేంజర్ ఈశ్వర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ప్రతాపరుద్ర కోటపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే ఫారెస్ట్​ సిబ్బంది అక్కడకు వెళ్లగా ఐదుగురు వ్యక్తులు కనిపించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. ఘటనా స్థలంలో రెండు బైక్ లు, ఒక మొబైల్ ఫోన్, పూజా సామగ్రి, అధునాతన టార్చ్ లైట్లు, పరికరాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ లో కొన్ని మంత్రతంత్రాల ఫోటోలు, గుంతల ఫోటోలు ఉన్నాయి.

నిందితుల్లో అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్​ నేత రామచంద్రయ్య, వంగురోనిపల్లికి చెందిన జక్క రామాంజనేయులు, మహబూబ్​నగర్​కు చెందిన టీచర్​ చంద్రమౌళి, దేవరకొండ నియోజకవర్గం మల్లేపల్లికి చెందిన బిజిని చంద్రయ్య, భూత్పూర్​ మండలం గోప్లాపురానికి చెందిన కృష్ణ ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సంచరించడం, మారణాయుధాలు కలిగి ఉన్నందుకు వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, తెలంగాణ అటవీ రక్షణ చట్టం 1967 కింద  కేసులు నమోదు చేశారు.