మొదటి రోజు 9 శాతమే హాజరు

మొదటి రోజు 9 శాతమే హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 6,7,8 క్లాసులు కూడా స్టార్ట్ అయినయి. కానీ సర్కార్ హడావుడి నిర్ణయంతో బుధవారం తొలిరోజున స్కూళ్లలో అంతగా సందడి కనిపించలేదు. స్టేట్ వైడ్ గా కేవలం 9 శాతం మంది స్టూడెంట్స్ మాత్రమే స్కూళ్లకు అటెండ్ అయ్యారు. గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో 9 శాతం, ప్రైవేటు స్కూళ్లలో10 శాతం, మోడల్ స్కూళ్లలో 2 శాతం, కేజీబీవీల్లో 4 శాతం మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. గురుకులాలో స్టూడెంట్స్ ఒక్కరూ రాలేదు. ఓవరాల్​గా మూడు క్లాసుల్లో కలిపి మొత్తం13,11,772 మంది స్టూడెంట్స్ ఉండగా, వారిలో1,17,304 మంది మాత్రమే ఫస్ట్ రోజు హాజరైనట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వెల్లడించారు.

హాజరుపై ‘హడావుడి’ ఎఫెక్ట్

కరోనా ఎఫెక్ట్​తో నిరుడు మార్చి16 నుంచి మూతపడిన హైస్కూళ్లను బుధవారం నుంచి పూర్తిగా ఓపెన్ చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నమే హడావుడిగా ప్రకటించింది. సడెన్ గా ప్రకటన రావడంతో సర్కారు స్కూళ్ల హెడ్మాస్టర్లతో సహా ప్రైవేటు స్కూళ్ల మేనేజ్మెంట్లు కూడా రీఓపెన్ కు సన్నద్ధం కాలేకపోయారు. దీని ఎఫెక్ట్ స్కూళ్లలో స్టూడెంట్ల అటెండెన్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 7,795 సర్కారు స్కూళ్లు ఉండగా, 7,501 స్కూల్స్​మాత్రమే ఓపెన్ అయ్యాయి. వీటిలో 4,94,039 మంది స్టూడెంట్స్​కు గాను 42,660 మంది మాత్రమే హాజరయ్యారు. 9,529 ప్రైవేటు హైస్కూళ్లుంటే, 8,432 స్కూళ్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. వీటిలో 7,07,064 మందికి గాను 71,453 మంది మాత్రమే హాజరయ్యారు.

నారాయణపేటలో 19 శాతం..

జిల్లాలవారీగా ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్లన్నింటినీ కలిపి చూస్తే.. నారాయణ పేట జిల్లాలో అత్యధికంగా 19 శాతం అటెండెన్స్ నమోదైంది. ఆ తర్వాత యాదాద్రి జిల్లాలో17శాతం, రంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో16 శాతం స్టూడెంట్స్ హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో అతితక్కువగా 30,125 మందికి గాను 63 మందే హాజరయ్యారు. ఆదిలాబాద్​జిల్లాలో సేవాలాల్​జయంతి సందర్భంగా లోకల్ హాలీడే ఉండటంతో స్కూళ్లు ఓపెన్ కాలేదు. ఇక రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు స్టూడెంట్స్ వచ్చినా, బడులు శానిటైజ్ చేయలేదని వారిని వెనక్కి పంపించారు. స్టూడెంట్లు, పేరెంట్స్ కు సమాచారం లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది హాజరు కాలేదని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో అటెండెన్స్ 70 శాతం వరకూ పెరుగుతుందని భావిస్తున్నారు.