రెండో రోజు అటుకుల బతుకమ్మ.. పూలనే ఎందుకు పూజిస్తారో తెలుసా..

రెండో రోజు అటుకుల బతుకమ్మ.. పూలనే ఎందుకు పూజిస్తారో తెలుసా..

పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగలో బతుకమ్మలో ఒదిగిపోయే పువ్వులు పండుగ బతుకమ్మ పండుగ సంబురాలతో తెలంగాణ రంగుల శోభాయమాయంగా తయారైంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా కనువిందుగా ఉంటుంది.

2023 అక్టోబర్ 14న ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన ఆదివారం (అక్టోబర్ 15) అటుకుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి.

బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే తమ్ముళ్లంతా కలసి అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను ఇంటి ఆడపడుచులు రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చుతారు. సాయంత్రం అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ కలిసి, ఆడి, పాడుతారు. 

బతుకమ్మ ప్రసాదం

బతుకమ్మ నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈ రోజు(అక్టోబర్ 15) అటుకులను వాయనంగా ఇస్తారు. తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు.

ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే...

1) ఎంగిలి పూల బతుకమ్మ

2) అటుకుల బతుకమ్మ

3) ముద్దపప్పు బతుకమ్మ

4) నానే బియ్యం బతుకమ్మ

5) అట్ల బతుకమ్మ

6) అలిగిన బతుకమ్మ

7) వేపకాయల బతుకమ్మ

8) వెన్నముద్దల బతుకమ్మ

9) సద్దుల బతుకమ్మ

ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ.. భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను చిన్నా, పెద్దా అంతా కలసి పండగను ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. 

బతుకమ్మలో పూలనే ఎందుకు

బతుకమ్మలో ప్రతి పువ్వుకు విశిష్టత ఉంది. అయితే పువ్వులన్నింటిలో తంగేడు పువ్వుకు ఎక్కువ ప్రధాన్యత ఉంది. దానికి కారణం అది గుత్తులుగా విరబూస్తుంది. తమ సంసారం కూడా అట్లా పచ్చగా పుస్టిగా ఉండాలని మహిళలు కోరుకుంటారు. 

వాసనలేని పూలను దేవుని పూజకు వాడరు. కానీ బతుకమ్మకు ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును వాడతారు. గునుగు, టేకు, తంగేడు, గుమ్మడి, కట్ల, కాకర, గన్నేరు, పొట్ల, పొగడ, రుద్రాక్ష, గోరింట, మల్లె, బంతి, చామంతి, శంకు ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం. 

అయితే బతుకమ్మను చెరువులు, కుంటల్లో ఉన్న నీటిని శుభ్రపరచడానికి ఒక ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.