హైదరాబాద్: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్తో లక్ష్మయ్య హెవీ లైసెన్స్ పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. మిరియాల లక్ష్మయ్య సొంతూరు ఏపీలోని పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన దుర్ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బస్సు బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు.
లోపల దట్టమైన పొగ వ్యాపించడం, హైడ్రాలిక్ డోర్ తెరుచుకోకపోవడంతో అశ్విన్‌రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్‌సీటు వెనుకాల ఉన్న చిన్న మిర్రర్పగులగొట్టుకొని బయటకువచ్చాడు. ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు బస్సు వెనుక ఉన్న అద్దాన్ని పగుల గొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారు. కానీ బస్సు ముందు భాగంలో ఉన్నవారంతా బయటకు రాలేక, మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు ఉండగా.. ఏపీకి చెందిన ఆరుగురు, కర్నాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరిది బిహార్, ఒకరిది ఒడిశా కాగా.. మరొకరిది ఏ రాష్ట్రమో గుర్తించాల్సి ఉంది. రాత్రి 9:30 గంటలకు పటాన్‌చెరు నుంచి బయలుదేరిన బస్సు ఆరాంఘర్ మీదుగా బెంగళూర్ రూట్‌లో ప్రవేశించింది. ప్రయాణికుల కోరిక మేరకు మధ్యలో ఒకచోట బస్సు ఆపారు.
ఆ తర్వాత రాత్రి 2:30 నుంచి 3 గంటల మధ్య బస్సు కర్నూల్ జిల్లా ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో 100కు పైగా స్పీడ్‌తో వెళ్తున్న బస్సు.. దాని ముందు వెళ్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న కర్నూల్ వాసి శివశంకర్ అమాంతం డివైడర్ పైకి ఎగిరిపడి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలోనే బస్సు ముందు భాగంలో బైకు ఇరుక్కోగా, దాన్ని దాదాపు 300 మీటర్ల దూరంఈడ్చుకెళ్లింది. సరిగ్గా అప్పుడే నిప్పు రవ్వలు చెలరేగడం, బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ బస్సును ఆపి, మరో డ్రైవర్‌ను నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్స్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డోర్‌లాక్ ఓపెన్ చేయకుండానే డ్రైవర్లు పరారయ్యారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
