విశాక ఇండస్ట్రీస్‌ ఆవిష్కరణకు పేటెంట్ ఇష్యూ చేసిన అమెరికా

విశాక ఇండస్ట్రీస్‌ ఆవిష్కరణకు పేటెంట్ ఇష్యూ చేసిన అమెరికా

సరికొత్త ఆవిష్కరణలతో  విశాక ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మరోసారి ఘనతను చాటుకుంది. ఈ కంపెనీ తయారు చేసిన ‘‘ఆటమ్ సోలార్ రూఫ్’’కు అగ్రరాజ్యం అమెరికాలో పేటెంట్‌ను సొంతం చేసుకుంది. 20 సంవత్సరాల వ్యాలిడిటీతో అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేటెంట్స్ ఆఫీసు ఈ పేటెంట్‌ను జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూప్‌ ఇన్నొవేషన్‌కు గానూ ఈ పేటెంట్‌ను  అమెరికా పేటెంట్స్ ఆఫీస్ ఇష్యూ చేసింది. ఈ ప్రొడక్ట్‌కు ఇప్పటికే మన దేశంలోని నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబ్‌ నుంచి ప్రతిష్టాత్మక యూఎల్ సర్టిఫికేట్ వచ్చింది. పేటెంట్‌ వచ్చిన సందర్భంగా విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ గడ్డం మాట్లాడుతూ.. 2018లో ఆటమ్‌ సోలార్ రూఫ్ టాప్స్‌ తయారీ షురూ చేసిన నాటి నుంచి సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలో తమ ప్రోడక్ట్‌ లీడింగ్‌లో ఉందని  అన్నారు. తమ ప్రొడక్ట్‌ను అన్ని రకాలుగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో స్వదేశంలోనే తయారు చేస్తున్నామని చెప్పారు. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమల అవసరాలను సైతం తీరుస్తూ అందుబాటులో ఎకో ఫ్రెండ్లీ క్లీన్ ఎనర్జీని అందించేలా ఆటమ్‌ సోలార్ రూఫ్స్‌ను రూపొందించామని అన్నారు.

2020లోనే ఇండియాలో పేటెంట్

మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌లో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన పై కప్పును డిజైన్‌ చేసి, తయారు చేసింది విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ. 2018లో తయారు చేసిన ఈ రూఫ్ టాప్స్‌కు 2020లోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పేటెంట్ రాగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆటమ్ సోలార్ రూఫ్‌కు మేధో హక్కులను సొంతం చేసుకుంది. సోలార్ పవర్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో ఆటమ్‌ కంపెనీకి ఈ పేటెంట్స్ రావడం మరింత జోష్‌ను ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దక్షిణాఫ్రికా, అమెరికా లాంటి దేశాల్లో సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి, వినియోగం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా దేశాల్లో ఎదుగుదలకు ఇది ఎంతో తోడ్పాటునిచ్చే అంశమని పేర్కొన్నాయి. 

తయారీ, అసెంబ్లింగ్‌.. అన్నీ ఇండియాలోనే

ఆటమ్‌ సోలార్ రూఫ్‌.. పూర్తి స్థాయి ‘మేకిన్‌ ఇండియా ప్రొడక్ట్‌’గా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన డిజైన్ నుంచి తయారీ, అసెంబ్లింగ్ అన్ని ఇండియాలోనే జరుగుతున్నాయి. ఈ ప్రొడక్ట్‌ను ఇప్పటికే మన దేశంలోని తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలతో పాటు ఆఫ్రికా, ఆగ్నేయాసియాల్లో ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు లక్షల చదరపు అడుగుల రూఫ్‌ ఇన్‌స్టాల్ చేసింది ఆటమ్. దీని నుంచి ఆరు వేల కిలో వాట్‌ పీక్‌ పవర్ ఉత్పత్తి అవుతోంది. అంటే ఆటమ్‌ ఇన్‌స్టాల్ చేసిన సోలార్ రూఫ్‌ టాప్‌ నుంచి.. ప్రతి గంటకూ 6 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 


ఆటమ్‌ సోలార్‌‌ రూఫ్‌ స్పెషాలిటీలెన్నో..

ఆటమ్‌ సోలార్‌‌ రూఫ్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే  తొలి  మోనో క్రిస్టలిన్ PERC సెల్స్‌తో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ సోలార్‌‌ రూఫ్‌  ఇది. మార్కెట్‌లో ఉన్న సంప్రదాయ సోలార్ ప్యానెల్స్‌తో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ సామర్థ్యంతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 57 చదరపు అడుగుల ఆటమ్ రూఫ్ ప్యానెల్‌తోనే ఒక కిలో వాట్‌ పవర్‌‌ జనరేట్ చేయొచ్చు. అయితే సంప్రదాయ ప్యానెల్స్‌ నుంచి ఒక కిలో వాట్‌ కరెంట్ ఉత్పత్తి చేయాలంటే 90 చదరపు అడుగులు ఉండాల్సి వస్తోంది. అలాగే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సంప్రదాయ సోలార్ రూఫ్స్‌ 15 ఏండ్ల లైఫ్ స్పాన్‌ మాత్రమే కలిగి ఉండగా.. ఆటమ్ సోలార్‌‌ రూఫ్‌ లైఫ్ స్పాన్‌ 30 ఏండ్ల పాటు ఉంటుంది. ఆటమ్‌ సోలార్‌‌ రూఫ్ అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటుందని పుణేలోని హై ఫిజిక్స్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్‌ ల్యాబ్‌లో చేసిన సాల్ట్ మిస్ట్ కరోజన్ టెస్టింగ్‌లో తేలింది. అలాగే ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ) స్టాండర్డ్స్‌ కలిగి ఉన్నందుకు గానూ అమెరికా, జర్మనీల్లో యూఎల్‌ సర్టిఫికేషన్‌ను పొందింది ఆటమ్‌ సోలార్ రూఫ్.  లీక్‌ ప్రూఫ్‌ సోలార్ సీలింగ్‌ తయారీలో అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్‌ స్టాండర్స్‌లో మేటిగా నిలవడంతో ఆ సంస్థ సర్టిఫికేషన్‌ కూడా అందుకుంది. ఈ రూఫ్ హరికేన్లను సైతం తట్టుకుని నిలవగలదని టెస్టుల్లో తేలింది. 

2018 నుంచి పర్యావరణ హిత ఎనర్జీ వైపు అడుగులు

2018లో  ‘ఆటమ్‌’ను విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌‌ వంశీ కృష్ణ గడ్డం ప్రారంభించారు. నాటి నుంచి దేశంలోనే లీడింగ్ సస్టెయినబుల్ బిల్డింగ్ మెటీరియల్ ప్రొవైడర్‌‌గా ఎదుగుతోంది. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని రెన్యువబుల్, పర్యావరణ హిత ఎనర్జీ వైపు అడుగులు వేసేందుకు వంశీ కృష్ణ  ఎంతో కృషి చేశారు. పర్యావరణాన్ని కాపాడడం పట్ల స్పృహతో, సామాజిక బాధ్యతతో బిజినెస్‌ చేయాలన్నది ఆయన ఆలోచన. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్న  కార్బన్‌ ఎమిషన్స్‌ను తగ్గిస్తూ రెన్యువబుల్ ఎనర్జీను వాడుకోవాలన్న నినాదాన్ని ప్రమోట్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.