
- నీళ్లున్నా.. ఏండ్లుగా బోటింగ్ సేవలు లేవు
- పార్క్ నిర్వహణను పట్టించుకోని అటవీశాఖ
- విజ్ఞానం కలిగించే వృక్షజాతులు కనుమరుగు
- నేషనల్ హైవే నిర్మాణంతో ధ్వంసమైన పిల్లల పార్క్
- పునరుద్ధరించాలంటున్న పర్యాటకులు, జిల్లా వాసులు
కోల్‌బెల్ట్,వెలుగు: మంచిర్యాల జిల్లా ప్రజలు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన గాంధారి వనం పార్క్ లో ఆహ్లాదం కరువైంది. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేయగా పార్క్నిర్వహణపై అటవీశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి బొక్కలగుట్ట బ స్ స్టేజ్‌వద్ద 2015లో 400 ఎకరాల నాచురల్ఫారెస్ట్లో గాంధారి వనం పేరుతో అర్బన్పార్క్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటైన అర్బన్ పార్క్‌లో మొదటిది.
ఇందులో స్మృతివనం, రాశీవనం, ఔషధవనం, పిల్లల ఆట వస్తువులు, వన భోజనాలకు అవసరమైన స్థలం, నర్సరీలోని నీటి కుంటలో బోటింగ్, వందలాది రకాల వృక్షజాలం, ఫాజిల్స్, వాకింగ్ ట్రాక్,సేదతీరేందుకు షెడ్డు నిర్మించారు. బెంచీలు, యోగ షెడ్డు,సైకిల్లింగ్ కోసం అందుబాటులో సైకిల్స్‌ను కూడా ఉంచారు. 50ఎకరాల స్థలంలో జింకల సంరక్షణ కేంద్రం, రాష్ట్ర చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇటీవల మరో రెస్ట్‌హాల్, రెండు కొత్త నీటి కుంటలను, డ్రికింగ్వాటర్కోసం ఆర్వో ప్లాంట్, టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చారు. అయితే పర్యాటకులు, జిల్లా వాసులకు పూర్తిస్థాయి ఆహ్లాదాన్ని అందించడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టడంలేదు.
ఏండ్లుగా నిలిచిన బోటింగ్సేవలు
గాంధారీవనం అర్బన్పార్కులోని నీటి కుంటలో నీళ్లు అడుగంటిపోవడంతో 2017లో పర్యాటకులు, జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించిన బోటింగ్సేవలను నిలిపివేశారు. నీళ్ల కోసం బోరువేయడం కాని పక్కనే ప్రవహించే పాలవాగులోని నీళ్లను పైపులైను ద్వారా కుంటలోకి మళ్లించడంగానీ చేయలేదు. మొదట్లో బోటింగ్సేవలపై పర్యాటకులు, జిల్లా వాసులు ఆసక్తి చూపడంతో అటవీశాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జించింది.
9 ఏండ్ల కింద నీళ్లు లేవని సాకు చూపుతూ బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. కొన్నాళ్లుగా పార్కులోని నీటి కుంట నిండి కళకళలాడుతోంది. అయినా బోటింగ్సేవల పునరుద్ధరణపై మాత్రం అటవీశాఖ ఆఫీసర్లు ఫోకస్ చేయడంలేదు. నామమాత్రపు ఫీజుతో పార్కులోకి అనుమతిస్తుండగా.. రిక్రియేషన్ ను పట్టించుకోవడంలేదు. వృక్షజాతులపై విజ్ఞానం కల్గించేలా ఏర్పాటు చేసిన పలు వనాలు కనుమరుగయ్యాయి.
నేషనల్హైవే –363 ఫోర్లేన్నిర్మాణంతో పిల్లల పార్కు పూర్తిగా ధ్వంసమైంది. తిరిగి దాన్ని కూడా పునరుద్ధరించలేదు. సైక్లింగ్ఊసేలేదు. నీటి కుంట నిండడంతో గాంధారీవనం అర్బన్‌పార్క్‌లో నిలిచిన బోటింగ్సేవలను తిరిగి ప్రారంభించాలని పర్యాటకులు, జిల్లా వాసులు డిమాండ్చేస్తున్నారు.