
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘దూత’. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ‘విక్రమ్ కుమార్ ‘దూత’ కాన్సెప్ట్ చెప్పగానే చాలా యూనిక్‌గా అనిపించింది. అయితే దాన్ని ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఎలా మలుస్తారనే క్యూరియాసిటీ ఉండేది.
కొన్ని నెలల తర్వాత ఆయన ఎపిసోడ్స్ వారీగా కథ చెప్పారు. తర్వాత ప్రైమ్ వీడియో వాళ్లు పార్ట్‌నర్స్‌గా వచ్చారు. జులైలోనే ఫైనల్ కాపీ అమెజాన్ వాళ్లకి ఇచ్చాం. పలు భాషల్లో డబ్ చేయడం, సబ్ టైటిల్స్ రెడీ చేయడానికి ఐదు నెలల టైమ్ పట్టింది. ఇప్పుడు అన్ని వైపుల నుంచి హిట్ టాక్ రావడం ఫుల్ హ్యాపీ. ముఖ్యంగా నాగచైతన్య గారి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇలాంటి పాత్రలో చైతుని చూడటం చాలా కొత్తగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అలాగే ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, గౌతమ్, రవీంద్ర విజయ్ తమ అద్భుతమైన నటనతో సిరీస్‌కు కొత్తదనం తీసుకొచ్చారు. ఇక టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారితో వరుస సినిమాలు చేశాను. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చి.. ది గ్రిల్, సిన్, ఎక్స్‌పైరీ డేట్, గాలివాన సిరీస్‌లు నిర్మించా. ఇప్పుడు ‘దూత’తో బిగ్ సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. సినిమాలపై కూడా ఫోకస్ ఉంది. కథలపై వర్క్ చేస్తున్నాం. సినిమాలు, ఓటీటీ రెండింటిని చేస్తాం’ అన్నారు.