ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రెండు ఆడియోలు లీక్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రెండు ఆడియోలు లీక్
  • మీడియాకు ముందే సమాచారం ఇచ్చి రిలీజ్‌ చేసిన ప్రగతిభవన్‌ వర్గాలు
  • తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని రామచంద్ర భారతితో రోహిత్​రెడ్డి చెప్పినట్టు మొదటి ఆడియో
  • రెండో ఆడియోలో రోహిత్​​కు ‘వంద’, మిగతా ఎమ్మెల్యేలకు కొంత ఇవ్వాలన్నట్టు ప్రస్తావన
  • ఫామ్​హౌస్‌ డీల్​పై ఎన్నో డౌట్స్​
  • ఎమ్మెల్యేలు, లీడర్ల ఫోన్లన్నీ ట్యాప్‌ అవుతున్నాయా?
  • ఇంకా ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ప్రగతి భవన్‌‌ నుంచి ఆడియోలు లీక్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి, రామచంద్ర భారతి, మిగతా ఇద్దరు నిందితులు మాట్లాడినట్టు ఉన్న రెండు ఆడియో రికార్డులు శుక్రవారం బయటికి వచ్చాయి. వీటిని రిలీజ్ చేయబోతున్నట్లు సీఎం క్యాంప్‌‌ ఆఫీస్‌‌ నుంచి ముందే లీకులు ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో ఈ కాల్‌‌ రికార్డింగ్స్‌‌ను రిలీజ్‌‌ చేశారు. మొదట తమకు అనుకూల మీడియాకు ఇచ్చి.. తర్వాత కొన్ని నిమిషాలకు మిగతా మీడియా సంస్థలకు రికార్డింగ్స్‌‌ను పంపారు. ఈ రెండు ఆడియోలు ఈనెల 24కు ముందే మాట్లాడినట్టుగా అందులోని సంభాషణల్లో ఉంది. బీజేపీ ముఖ్య నేత బీఎల్‌‌‌‌ సంతోష్‌‌‌‌ తనకు తెలుసని, ఆయనతో మీటింగ్‌‌‌‌ ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌ రెడ్డికి రామచంద్రభారతి చెప్పినట్లుగా మొదటి ఆడియోలో ఉంది. రెండో ఆడియోలో రోహిత్‌‌‌‌ రెడ్డి రూ.100 (వంద కోట్లు అనుకోవాలే) ఎక్స్‌‌‌‌పెక్ట్‌‌‌‌ చేస్తున్నట్టు రామచంద్ర భారతితో నందు చెప్పారు. ఈ ఆడియో రికార్డులు బయటికి వచ్చిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా అన్న సందేహాలు వస్తున్నాయి. 

మాపై నిఘా ఉంది..: రోహిత్‌‌‌‌ రెడ్డి

14 నిమిషాలకు పైగా ఉన్న మొదటి ఆడియోలో ఎమ్మెల్యే పైలెట్‌‌‌‌ రోహిత్‌‌‌‌ రెడ్డి, నందకుమార్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌ కాల్‌‌‌‌లో రామచంద్ర భారతితో మాట్లాడినట్లు చెబుతున్నారు. తనతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని రామచంద్ర భారతికి రోహిత్‌‌‌‌ రెడ్డి ఆ ఆడియోలో చెప్పారు. అయితే ఆ ఇద్దరి పేర్లను ఇప్పుడే చెప్పలేనన్నారు. ఒకసారి కలిసి మాట్లాడితే మంచిదని రోహిత్‌‌‌‌ అనగా.. వేరే ఎక్కడైనా కలుద్దామని స్వామి బదులిచ్చారు.  బై ఎలక్షన్ జరుగుతున్నందున తమపై నిఘా ఉందని, వేరే ప్లేస్‌‌‌‌ వద్దని హైదరాబాదే బెస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ అని రోహిత్‌‌‌‌ తెలిపారు. ‘‘నేను బెడ్‌‌‌‌ రెస్ట్‌‌‌‌లో ఉన్నా. 24 తర్వాత వస్తా. బల్క్‌‌‌‌గా ఎమ్మెల్యేలు రెడీగా ఉంటే బీఎల్‌‌‌‌ సంతోష్‌‌‌‌ వస్తారు. బీజేపీలో ఆయన చాలా కీలక నేత. ఆయన నాకు బాగా తెలుసు. మీరు ఒక ప్రపోజల్‌‌‌‌ పెడితే నేను మాట్లాడుతా’’ అని రామచంద్ర భారతి అన్నట్లు ఆడియోలో ఉంది. ఈ నేపథ్యంలో 26న హైదరాబాద్‌‌‌‌లో కలవాలని రోహిత్‌‌‌‌, నందూ, స్వామి నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేలను.. నంబర్‌‌‌‌ 1, 2లలో ఎవరితో కలిపిస్తావు అని నందూ అడుగ్గా, బీఎల్‌‌‌‌ సంతోష్‌‌‌‌ ఇంటికి నంబర్‌‌‌‌ 2 వస్తారని, ఆయనతో కలిపిస్తానని స్వామి చెప్పినట్లు అందులో ఉంది. ‘‘మా సీఎం గురించి తెలుసుకదా.. ఈ విషయం తెలిస్తే ఆయన మా పని పడుతారు. విషయం బయటికి పొక్కొద్దు” అని రోహిత్‌‌‌‌ అన్నారు.  భవిష్యత్‌‌‌‌, భద్రత అన్నీ కేంద్రమే చూసుకుంటుందని, ఇలాంటి విషయాలు బెంగాల్‌‌‌‌లో చాలా బాగా హ్యాండిల్‌‌‌‌ చేశామని రామచంద్ర భారతి చెప్పారు.

‘100’ ఎక్స్‌‌‌‌పెక్ట్‌‌‌‌ చేస్తున్నడు

27 నిమిషాల నిడివి ఉన్న రెండో ఆడియోలో నందకుమార్‌‌‌‌, సింహయాజులు కాన్ఫరెన్స్‌‌‌‌ కాల్‌‌‌‌లో రామచంద్ర భారతితో మాట్లాడారు. పార్టీ మారేందుకు ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌రెడ్డి రూ.100 (వంద కోట్లు) ఎక్స్‌‌‌‌పెక్ట్‌‌‌‌ చేస్తున్నాడని రామచంద్ర భారతికి నందకుమార్‌‌‌‌ వివరించారు. ఆయన వెంట ఇంకో ముగ్గురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను ఇలాంటి విషయాలు బండి సంజయ్‌‌‌‌, కిషన్‌‌‌‌ రెడ్డి లాంటి వాళ్లతో డీల్‌‌‌‌ చేయబోనని, పెద్దవాళ్లతోనే కూర్చోబెడతానని స్వామి వివరించారు. రోహిత్‌‌‌‌ రెడ్డి వెంట వచ్చే మిగతా ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని స్వామి కోరగా.. చేవెళ్ల, కొడంగల్‌‌‌‌, పరిగి ఎమ్మెల్యేలు టచ్‌‌‌‌లో ఉన్నారని నందు తెలిపారు. మునుగోడు ఎన్నిక లోపే పైలెట్‌‌‌‌ చేరితే ‘వంద’ ఇచ్చేందుకు సిద్ధమని స్వామి తెలిపారు. రోహిత్‌‌‌‌కు ‘వంద’ ఇచ్చి, ఆయన వెంట వచ్చే వాళ్లకు ఎంతో కొంత ఇస్తే సరిపోతుందని నందు తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత రోహిత్‌‌‌‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, నెల రోజుల్లో ప్రభుత్వాన్నే రద్దు చేస్తారని స్వామి అన్నట్లు ఆడియోలో ఉంది. 

బెదిరింపులే లేకున్నా.. బెదిరించారంటూ..

రామచంద్ర భారతితో ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌ రెడ్డి మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియోలో ఎక్కడా కేసుల ప్రస్తావన లేదు. బీజేపీలో చేరకుంటే ఈడీ, ఇతర సంస్థలతో దాడులు చేయిస్తామన్న మాటే లేదు. అయినా రోహిత్‌‌‌‌ తనకు డబ్బులిస్తామని చెప్పారని, తాను బీజేపీలో చేరకుంటే ఈడీ రైడ్స్‌‌‌‌ చేయిస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 26న ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కొనుగోళ్ల డీల్‌‌‌‌ జరిగినట్టు చెప్తున్నా, అంత వరకు దీనిపై రోహిత్‌‌‌‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 24కు ముందే ఆయన రామచంద్ర భారతితో ఫోన్‌‌‌‌లో మాట్లాడినప్పుడు తనను ప్రలోభ పెడుతున్న విషయం ఎందుకు కంప్లైంట్‌‌‌‌ చేయలేదనేది సందేహాస్పదంగా మారింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడానికే రోహిత్‌‌‌‌ సిద్ధపడ్డారా.. అందుకే నందుతో కలిసి బేరసారాలకు దిగారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌లో ఆడియో ఎవిడెన్స్‌‌‌‌ ఉందని చెప్తున్నా వాటిని ఎందుకు కోర్టుకు సమర్పించలేదు.. అవే ఆడియో ఫైల్స్‌‌‌‌ను ప్రగతి భవన్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేయడానికి వెనుక కారణలేమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ఆడియో రికార్డింగ్‌‌‌‌లు, వీడియోలు శనివారం రిలీజ్‌‌‌‌ చేసే అవకాశముందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. వాటిని కోర్టుకే సమర్పిస్తే నిందితులను శిక్షించే అవకాశమున్నా, రాజకీయ ఆరోపణలకే ఎందుకు పరిమితం అయ్యారనే దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదు.

ప్రగతి భవన్‌‌‌‌లోనే ఆ నలుగురు

ఎమ్మెల్యేలు పైలెట్‌‌‌‌ రోహిత్‌‌‌‌ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌‌‌‌ రెడ్డి మూడు రోజులుగా ప్రగతి భవన్‌‌‌‌లోనే ఉన్నారు. రేగా కాంతారావు.. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ నిర్వహించబోతున్నట్టు శుక్రవారం ఉదయం ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేశారు. తాను ప్రగతి భవన్‌‌‌‌లో ఉన్న ఫొటోను తన సన్నిహితులకు పంపారు. ‘బీజేపీ బాగోతం బాగా ఉంది.. వన్‌‌‌‌ బై వన్‌‌‌‌ వస్తాయి’ అంటూ మరో పోస్ట్‌‌‌‌ పెట్టారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మరికొన్ని రోజులు ప్రగతి భవన్‌‌‌‌లోనే ఉంటారని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నేతలు చెప్తున్నారు. వాళ్లు ప్రగతి భవన్‌‌‌‌లోనే ఉన్నా, కేసీఆర్‌‌‌‌ వారితో మాట్లాడలేదని, వారి నుంచి వివరాలన్నీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు సేకరించి కేసీఆర్‌‌‌‌కు వివరిస్తున్నారని చెప్తున్నారు.

ఫోన్లు ట్యాప్‌‌‌‌ అవుతున్నయా?

మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో నందకుమార్‌‌‌‌తో పాటు రామచంద్రభారతి, సింహయాజీల ఫోన్లను పోలీసులు సీజ్‌‌‌‌ చేశారు. వారి ఫోన్లలో ఉన్న రికార్డింగులనే ప్రగతి భవన్‌‌‌‌ నుంచి లీక్‌‌‌‌ చేశారా లేక రాష్ట్రంలో ప్రముఖులందరి ఫోన్లు ట్యాప్‌‌‌‌ అవుతున్నాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీల నాయకులు, కీలక అధికారులు, పలువురు మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్‌‌‌‌ చేస్తోందని ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రగతి భవన్‌‌‌‌ నుంచే ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌కు సంబంధించిన ఆడియో లీక్స్‌‌‌‌ రావడం ట్యాంపింగ్‌‌‌‌ల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.