V6 News

16 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం

16 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం
  • మొదటి దశలో 10 వేల మందికి చెక్కులు 
  • పంపిణీ చేయాలని మంత్రి హరీశ్  ఆదేశాలు


హైదరాబాద్, వెలుగు: మైనార్టీలకు ఈనెల 16 నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్  ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై మంత్రులు హరీశ్  రావు, మహమూద్  అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్  యాదవ్, డిప్యూటీ స్పీకర్  పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్  ఒవైసీ చర్చించారు. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు, క్రిస్టియన్లకు శ్మశాననవాటికల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

మంత్రి హరీశ్ మాట్లాడుతూ శ్మశానవాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు, మౌజంల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. లక్షరూపాయల ఆర్థికసాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈనెల 16 నుంచి రూ.లక్ష చెక్కుల పంపిణీ ప్రారంభించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలన్నారు.