
- సెప్టెంబర్ 9న సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు
- స్పీడ్‌గా కొనసాగుతున్న పనులు
- ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం, నయీంనగర్ బ్రిడ్జి పనులు ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. దీంతో తొమ్మిదేండ్లుగా సాగుతున్న కాళోజీ కళాక్షేత్రంతో పాటు, ఏప్రిల్‌లో మొదలుపెట్టిన నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. అనుకున్న గడువులోగా పనులను పూర్తి చేసేలా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు గ్రేటర్ మేయర్, కలెక్టర్, బల్దియా చైర్మన్ కాంట్రాక్టర్ల వెంటపడుతున్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్‍రెడ్డిని ఆహ్వానించి ఈ పనులను ప్రారంభించేలా ప్లాన్ చేశారు.
కళాక్షేత్రానికి పదేండ్ల తర్వాత ముహూర్తం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభానికి పదేండ్ల తర్వాత ముహుర్తం కుదిరింది. కాళోజీ జయంతి సందర్భంగా 2014 సెప్టెంబర్ 09న అప్పటి సీఎం కేసీఆర్ హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లో కళాక్షేత్రం పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో రవీంద్రభారతిని తలదన్నెలా నిర్మించే కళాక్షేత్రాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు. సుమారు వెయ్యిమంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మించాలని చెప్పి పనుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
నాలుగు అంతస్తుల్లో బిల్డింగ్ ప్లాన్ చేశారు. కానీ సీఎం స్థాయిలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన పనులే తొమ్మిదేండ్లు దాటినా పూర్తి చేయలేకపోయారు. బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఏండ్ల తరబడి అలాగే ఉండడంతో నిర్మాణాలు పలుచోట్ల కుంగాయి. దీంతో వరంగల్ ఎన్‌ఐటీ సివిల్ ఇంజినీరింగ్ టీం నిర్మామాలను పరిశీలించి పనుల్లో క్వాలిటీ లేదని రిపోర్ట్ ఇచ్చింది. కళాక్షేత్రానికి ప్రధానంగా నిలిచే నాలుగు పిల్లర్ల రెట్రో ఫిట్టింగ్ చేయాలని సూచించారు. దీంతో రూ.50 కోట్ల పనులు కాస్తా రూ.70 నుంచి 75 కోట్లకు చేరాయి. అయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే సీఎం రేవంత్‍రెడ్డి కళాక్షేత్రం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించడంతో పనులు స్పీడందుకున్నాయి. మొత్తంగా 2014లో మొదలైన కళాక్షేత్రం 2024లో ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ఐదు నెలల్లోపే నయీంనగర్ బ్రిడ్జి
హనుమకొండ నుంచి కరీంనగర్ రోడ్డులో ఉన్న నయీంనగర్ బ్రిడ్జిని 50 ఏండ్ల ఇకంద నిర్మించారు. ఇన్నేండ్లలో నయీంనగర్‌ను ఆనుకుని వందలాది కాలనీలు వెలిశాయి. జనాభా, వాహనాలు పెరగడంతో నగరంలో ట్రాఫిక్ పెరగడంతో ఈ బ్రిడ్జి ఇరుకుగా మారింది. ఏటా వానాకాలంలో బ్రిడ్జి పైనుంచి వరద పారుతుండడంతో కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఏండ్ల తరబడి ముందుకు సాగని నయీంనగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు నయీంనగర్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకాం చుట్టారు. రూ.15.5 కోట్లతో చేపట్టిన ఈ పనులను ఏప్రిల్ 5న పాత బ్రిడ్జిని కూల్చడంతో మొదలుపెట్టారు. గతంలో 16 మీటర్ల వెడల్పు ఉన్న బ్రిడ్జిని 24.5 మీటర్లకు పెంచారు. వరదనీరు సాఫీగా వెళ్లేలా 10 మీటర్ల వెడల్పుతో మూడు ఖానాలు ఏర్పాటు చేశారు. 32 మీటర్ల పొడవు ఉండే బ్రిడ్జి నిర్మాణంలో చివర్లో ఉండే పిల్లర్లతో సంబంధం లేకుండా మధ్యలో రెండు పిల్లర్లు వేశారు. అలాగే ఎత్తును సైతం ఐదు మీటర్లు పెంచుతున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ వరంగల్‌లో ఏ పనులు చేయని రీతిలో నయీంనగర్ బ్రిడ్జి పనులను ఆగస్ట్ 30 వరకు అంటే కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
పనుల్లో స్పీడ్ పెరిగేలా చర్యలు
పనుల పేరుతో కొబ్బరికాయలు కొట్టామా.. ప్రచారం చేసుకున్నామా అన్నట్లు కాకుండా కాళోజీ కళాక్షేత్రం, నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. సకాలంలో నిధులు ఇవ్వడానికి తోడు పనుల్లో స్పీడ్ పెంచేలా కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు. దీంతో రెండు ప్రాజెక్ట్‌ల పనులను ఎమ్మెల్యే నాయినితో పాటు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సెప్టెంబర్ 9న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
గ్రేటర్ వరంగల్‌లో తొమ్మిదేండ్లు సాగిన కాళోజీ కళాక్షేత్రంతో పాటు ఇటీవల మొదలుపెట్టిన నయీంనగర్ బ్రిడ్జిని సెప్టెంబర్ 9న ప్రారంభించాలని ముహుర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‍రెడ్డిని జిల్లా పర్యటనకు ఆహ్వానించారు. ఆ సమయంలోగానే రెండు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.