
- సంగారెడ్డిలో జెండా ఎగరేసిన మంత్రి దామోదర
- మెదక్లో జెండా ఎగరేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి
సిద్దిపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే సర్కారు లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో 79 వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామన్నారు. ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు.
కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశామని, రైతు రుణమాఫీ పూర్తి చేయడమే కాకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల అభివృద్ధి కోసం సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇందిరా క్యాంటీన్లను ఇస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. హుస్నాబాద్ కేంద్రంగా కబడ్డీ అకాడమీ తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసి స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించారు.
జెండా ఎగరేసిన మంత్రి దామోదర
సంగారెడ్డి టౌన్: స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయంపాలన కోసం భారతదేశం సుదీర్ఘ పోరాటం చేసిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో టీజీ ఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ పి ప్రావీణ్యతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తుంన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రుణమాఫీ కింద జిల్లాలో లక్షా 4వేల 416 మంది రైతు కుటుంబాలకు రూ.910 కోట్ల 40 లక్షల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు.
రైతు భరోసా కింద 3లక్షల 58 వేల 863 మంది రైతుల ఖాతాల్లో రూ.42 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాకు 31,460 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 11,691 మందికి శస్త్ర చికిత్సలు జరగగా రూ.35 కోట్ల 15 లక్షలను ఖర్చు చేశామన్నారు. త్వరలోనే సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభిస్తామని, 500 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఆందోల్, నారాయణఖేడ్ , పటాన్చెరు నియోజకవర్గంలో 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ పనితీరు కనబరచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.