ఉక్రెయిన్– రష్యా వార్పై ట్రంప్, పుతిన్ భేటీ.. నో అంటే రష్యాకు తీవ్ర పరిణామాలు: ట్రంప్

ఉక్రెయిన్– రష్యా వార్పై ట్రంప్, పుతిన్ భేటీ.. నో అంటే రష్యాకు తీవ్ర పరిణామాలు: ట్రంప్
  • ఉక్రెయిన్– రష్యా వార్పై ట్రంప్, పుతిన్ భేటీ
  • అలాస్కా వేదికగా కీలక చర్చలు
  • విదేశాంగ మంత్రులతో పాటు అక్కడికి చేరుకున్న నేతలు 
  • యుద్ధం ముగించకపోతే రష్యాకు తీవ్ర ఆర్థిక పరిణామాలు: ట్రంప్  
  • భూ భాగం బదిలీపై నిర్ణయం ఉక్రెయిన్​దేనని వెల్లడి

యాంకరజ్ (అలాస్కా): ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అలాస్కా వేదికగా భేటీ అయ్యారు. యూఎస్​లోని అలాస్కా స్టేట్ యాంకరజ్ సిటీలో చర్చలు జరిపేందుకు శుక్రవారం ఉదయం వాషింగ్టన్ నుంచి ట్రంప్, మాస్కో నుంచి పుతిన్ బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు (ఇండియన్ టైం ప్రకారం శనివారం తెల్లవారుజామున 12.30 గంటలు) యాంకరజ్​లోని ఎల్మండార్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఇరువురు దేశాధినేతలు భేటీ అయ్యారు. ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ ఉన్నారు.

పుతిన్ వెంట రష్యా విదేశాంగ మం త్రి సెర్గీ లావ్రోవ్ తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్, రష్యా యుద్ధాని కి ముగింపు దిశగా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఇండియాపై ట్రంప్ 50 శాతం టారిఫ్​లు విధించడం.. పుతిన్​తో చర్చలు ఫెయిల్ అయితే ఇండియాపై మరిన్ని టారిఫ్​లు వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ భేటీ కీలకంగా మారింది. 

నో అంటే రష్యాకు తీవ్ర పరిణామాలు: ట్రంప్
వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరడానికి ముందుగా ట్రంప్ ‘హై స్టేక్స్ (ఉన్నతస్థాయి భాగస్వామ్యాలు)’ అంటూ తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తాను ఉక్రెయిన్ తరఫున బేరసారాలు జరిపేందుకు వెళ్లడం లేదని, పుతిన్​ను చర్చలకు రప్పించడమే తన లక్ష్యమన్నారు. పుతిన్ తో మీటింగ్ బాగా జరగకుంటే త్వరగానే ముగుస్తుందని.. మంచిగా జరిగితే త్వరలోనే ఉక్రెయిన్​లో శాంతి నెలకొంటుందన్నారు.

‘‘ఉక్రెయిన్పై దాడులు కొనసాగించడం వల్ల చర్చల్లో తనదే పైచేయి అవుతుందని పుతిన్ భావిస్తున్నారు. కానీ, ఇది ఆయనకు నష్టం కలిగిస్తుంది. యుద్ధాన్ని ముగించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని నేను ప్రయత్నిస్తున్నా. ఒకవేళ శాంతి ఒప్పందానికి రష్యా అంగీకరించకపోతే తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల బదిలీ గురించి కూడా పుతిన్​తో చర్చిస్తా. కానీ ఈ విషయంలో తుది నిర్ణయాన్ని ఉక్రెయిన్​కే వదిలేస్తా” అని ట్రంప్ చెప్పారు.

‘‘ట్రంప్ ఎకానమీ పట్ల పుతిన్ ఆసక్తితో ఉన్నారు. చర్చల్లో పురోగతి సాధిస్తే.. రష్యాతో బిజినెస్ విషయంపై మాట్లాడతా. అయితే, యుద్ధం ఆపేవరకూ వారు మాతో బిజినెస్ చేయలేరు” అని తెలిపారు. పుతిన్​తో ఈ రౌండ్ చర్చలు సక్సెస్ అయితే.. తదుపరి రౌండ్​లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీతో కలిసి ముగ్గురమూ భేటీ అయి చర్చిస్తామన్నారు.