
- గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా రూ.8.21 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు
- అప్పుల రీపేమెంట్లకే రూ.2.20 లక్షల కోట్లు చెల్లించినం
- ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమం ఆపట్లేదు.. అప్పుల భారం లేకుంటే మరింత చేసేటోళ్లం
- సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
- బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్
- గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో నిబద్ధతతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టు విధానాలు రూపొందించామని పేర్కొన్నారు.
‘‘దేశంలోని ఇతర రాష్ట్రాలే కాకుండా న్యూయార్క్ లాంటి ప్రపంచ నగరాలతోనూ తెలంగాణ పోటీ పడేలా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నం. ఈ ప్రయత్నంలో ప్రజల సహకారం చాలా అవసరం. మా ప్రభుత్వంపై దుష్ర్పచారం చేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి”అని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గౌరవం వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
‘‘హైదరాబాద్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించాం. ఏఐ సదస్సు, గ్లోబల్ రైస్ సమిట్, బయో ఏషియా సదస్సుతో పాటు మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. 2047 నాటికి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నం. 2035 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం”అని వెల్లడించారు. ‘‘స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత్‌ను ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా నిలబెట్టడంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయం, పారిశ్రామిక, వైజ్ఞానిక రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేశారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణను ప్రపంచంలోనే అగ్రపథంలో నిలబెట్టే లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తున్నాం”అని పేర్కొన్నారు.
అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతం..
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రా నికి రావాల్సిన నిధులు, అనుమతులు సాధించి.. బలమైన రాష్ట్రంగా తెలంగాణను పునర్నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసి, ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ‘‘తెలంగాణ అంటే ఇప్పుడు వ్యాపారానికి సరైన గమ్యస్థానం. ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు. ఆ పెట్టుబడులకు రక్షణ ఉండడంతో పాటు లాభాలు కూడా వస్తాయి. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పరిశ్రమలు, డ్రైపో ర్టులు, నేషనల్ హైవేల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ల్యాండ్ లాక్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు పోర్టులు లేవు. అందుకే బందర్ పోర్టుకు ప్రత్యేకమైన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేతో పాటు రైల్వే లైన్లను కూడా సాధించేందుకు కృషి చేస్తున్నం. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్ల నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు వంటి ప్రణాళికలతో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నం”అని పేర్కొన్నారు.
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నం..
సామాజిక న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే కులగణన సర్వే చేపట్టి, రాష్ట్రంలో 56.33 శాతం బీసీలు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. జనాభా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో ఏండ్ల కలగా ఉన్న ఎస్సీ వర్గీకరణను కూడా సాకారం చేశామన్నారు. ‘‘మాదిగ సోదరుల గుండె చప్పుడు నాకు తెలుసు. ఒకనాడు వాళ్ల కోసం శాసనసభలో కొట్లాడిన వాడిగా దశాబ్దాల కలను సహకారం చేసే సంకల్పం తీసుకున్నాను. దేశంలోని ఏ రాష్ట్రం చేయనిది మా ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి చట్టబద్ధత కల్పించాం” అని పేర్కొన్నారు.
సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు
కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే సంక్షేమం ఉందని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పాలనలో రైతులు, మహిళలు, యువతకు పెద్దపీట వేశామని చెప్పారు. ‘‘పదేండ్లుగా వేచి చూస్తున్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజ కవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేసినం. దీనికి పార్టీ అర్హత కాదు.. పేదరికమే గీటురాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచులు, ఆదివాసీలకు ప్రత్యేకంగా ఇండ్లు కేటాయించి సామాజిక న్యాయాన్ని అమలు చేశాం.
20 నెలల కాలంలో వైద్యారోగ్య రంగంపై రూ.16,521 కోట్లు ఖర్చు చేశాం. రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించనున్నం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినం. దీనికింద ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.6,790 కోట్లు చెల్లించినం. రైతులకు పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా, ఉచిత విద్యుత్ ఇస్తున్నం. సన్న వడ్లకు బోనస్ ఇస్తూ చివరి గింజ వరకూ కొంటున్నం. వడ్ల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాం”అని పేర్కొన్నారు.
శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు..
గత ప్రభుత్వం రూ.8,21,651 కోట్ల అప్పులు, బకాయిలను తమకు వారసత్వంగా మిగిల్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.6,71,757 కోట్లు అప్పులు కాగా.. ఉద్యోగుల బకాయిలు రూ.40,154 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, సింగరేణి, విద్యుత్ తదితర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,09,740 కోట్లు ఉన్నాయని వివరించారు. ‘‘గత పాలకులు చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికే మా ప్రభుత్వం గత 20 నెలల కాలంలో రూ.2,20,676 కోట్లు వెచ్చించింది. ఇందులో అసలు రూ.1,32,498 కోట్లు, వడ్డీలు రూ.88,178 కోట్లు ఉన్నాయి. ఈ అప్పుల భారం లేకపోయి ఉంటే.. ఈ నిధులు పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేవి. ఆర్థిక భారం ఉన్నప్పటికీ.. ఓపికతో, సమయస్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నం. ప్రజల ఆశీర్వాదమే మాకు బలం. శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తాం”అని చెప్పారు.
యువతను ఉపాధి వైపు మళ్లిస్తున్నం..
పదేండ్లుగా యువతను మత్తుకు బానిసలు చేసే కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. మత్తుకు బానిసైన యువతను ఉపాధి వైపు మళ్లిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘20 నెలల కాలంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేట్ రంగంలోనూ లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు చేపట్టినం. యువతలో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, క్రీడాకారులను తయారు చేయడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం’’ అని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు కీలకమని, తెలంగాణ పోలీసులు దేశంలోనే బెస్ట్‌గా నిలిచారని సీఎం కొనియాడారు.
హైడ్రాతో 30 వేల కోట్ల భూములు కాపాడినం..
హైడ్రాతో హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగిస్తున్నం. దీని ద్వారా ఇప్పటివరకు 13 పార్కులు, 20 చెరువులు, రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాపాడినం. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, హైదరాబాద్‌లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందించినం. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించినం. త్వరలోనే ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు మొదలవుతయ్.
సీఎం రేవంత్ రెడ్డి