David Warner: ఇదే నా ఆఖరి టీ20 మ్యాచ్‌.. ఆసీస్ అభిమానులకు షాకిచ్చిన వార్నర్‌

David Warner: ఇదే నా ఆఖరి టీ20 మ్యాచ్‌.. ఆసీస్ అభిమానులకు షాకిచ్చిన వార్నర్‌

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ తమ దేశ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. ఇప్పటికే టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ ఆసీస్‌ ఓపెనర్‌.. తాజాగా టీ20లకు ముగింపు పలికాడు. ఇకపై తాను సొంతగడ్దపై అంతర్జాతీయ టీ20లు ఆడబోనని తెలిపాడు. పెర్త్ వేదికగా మంగళవారం(ఫిబ్రవరి 13) వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20యే ఆస్ట్రేలియాలో తనకు ఆఖరి మ్యాచ్‌ అని సంచలన ప్రకటన చేశాడు.

Also Read:టీమిండియా మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

కొద్దిరోజుల క్రితం వార్నర్ టెస్టులకు, వన్డేలకు గుడ్ బై చెప్తూ.. ఈ ఏడాది అమెరికా/వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని తెలిపాడు. ఆ టోర్నీకి ముందు ఆసీస్ జట్టు తమ సొంతగడ్డపై టీ20 సిరీస్‌లు ఆడదు. ఈ క్రమంలోనే వార్నర్ ఈ ప్రకటన చేశాడు. త్వరలో ఆస్ట్రేలియా జట్టు.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో వార్నర్‌ ఆడినా అది కివీస్‌ గడ్డపైనే. ఆ తర్వాత అతను ఐపీఎల్‌ పాల్గొనేందుకు భారత్‌కు రానున్నాడు. అది ముగిశాక నేరుగా అమెరికాకు పయనం కానున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి టీ20లో వెస్టిండీస్ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 226 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఆసీస్ 183 పరుగులకే పరిమితమైంది. వార్నర్ ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.