
ఆస్ట్రేలియా–ఎ తో మంగళవారం (సెప్టెంబర్ 23) మొదలైన రెండో అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు ఇండియా బ్యాటింగ్ పేక మేడలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ లో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సాయి సుదర్శన్ 75 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. హెన్రీ థోర్న్టన్ ఇండియాకు కొరకరాని కొయ్యగా మారాడు.
సాయి సుదర్శన్ ఒక్కడే:
తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ విఫలమైన భారత ఏ జట్టు రెండో రోజు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజ్ లో ఉన్న సాయి సుదర్శన్ టీమిండియాను 194 పరుగులకు చేర్చాడు. రెండో టెస్ట్ కోసం తుది జట్టులోకి వచ్చిన రాహుల్ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఓపెనర్ జగదీసన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిడిల్ ఆర్డర్ లో పడికల్, జురెల్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక పరుగు చేసి పెవిలియన్ బాట పట్టారు. బదోని 21 పరుగులు చేసి సాయి సుదర్శన్ తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మానవ సుతార్ డకౌటయ్యాడు.
తొలి ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆసీస్ ఆలౌట్:
9 వికెట్ల నష్టానికి 350 పరులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 'ఏ' 420 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్ కు హెన్రీ థోర్న్టన్, టాడ్ మర్ఫీ కలిసి 91 పరుగులు జోడించి ఆసీస్ కు భారీ అందించారు. తొలి రోజు బ్యాటింగ్‌లో జాక్ ఎడ్వర్డ్స్ (88), నాథన్ మెక్‌స్వీని (74) రాణించడంతో... తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 350 స్కోరు చేసింది. ఓపెనర్ సామ్ కాన్‌స్టస్ (49) రెండో వికెట్‌కు 86, ఒలివర్ పీక్ (29)తో మూడో వికెట్‌కు 46, జోష్ ఫిలిప్పి (39)తో ఐదో వికెట్‌కు 52 రన్స్ జత చేసి ఔటయ్యాడు. 226 పరుగుల భారీ ధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.