263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత్, ఆసీస్ జట్ల మధ్య ఢిల్లీలో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆలౌట్అయింది. భారత బౌలర్లు ఆసీస్ జట్టును తొలి ఇన్ని్ంగ్స్ లో 263 పరుగులకే కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72*), ప్యాట్ కమిన్స్ (33) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు తీశారు.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్  జట్టుకు ఓపెనర్లు ఖవాజా, వార్నర్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతోన్న ఈ జోడీని షమీ విడదీశాడు. వార్నర్‌(15) ను పెవిలియన్‌ కు పంపాడు. ఆ తరువాత కూడా ఆసీస్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. లబుషేన్‌(18), స్మిత్‌ (0) ఇద్దరిని అశ్విన్‌ చేతికి చిక్కారు. ఒక్క పక్క వికెట్లు పడుతోన్న ఖవాజా నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 

లంచ్ బ్రేక్ తరువాత ఆసీస్ వెంటనే మరో వికెట్ కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ట్రావిస్‌ హెడ్ (12)ను షమీ ఔట్ చేశాడు. ఇక మరో వికెట్ పడకుండా ఖవాజా, హ్యాండ్స్‌కాంబ్ జాగ్రత్తగా ఆడారు. అయితే సెంచరీకి దగ్గరలో ఉన్న  ఉస్మాన్ ఖవాజా (81) జడేజా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్‌ కి చిక్కి వెనుదిరిగాడు. దీంతో 168 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన క్యారీ డకౌట్ అయ్యాడు. చివరి వరకు హ్యాండ్స్‌కాంబ్ ఒక్కడే క్రీజ్ లో నిలబడటంతో ఆసీస్ 263 పరుగులు చేయగలిగింది.