AUS vs WI: విండీస్‌ను వైట్‌వాష్ చేసిన కంగారూలు.. ఇండియా తర్వాత ఆస్ట్రేలియాకే సాధ్యమైంది

AUS vs WI: విండీస్‌ను వైట్‌వాష్ చేసిన కంగారూలు.. ఇండియా తర్వాత ఆస్ట్రేలియాకే సాధ్యమైంది

సొంతగడ్డపై వెస్టిండీస్ కు ఘోర పరాభవం. టీ20 ఫార్మాట్ లో అదరగొట్టే వెస్టిండీస్ జట్టు సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో క్లీన్ స్వీప్ అయింది. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ విన్నర్ వెస్టిండీస్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 0-5 తేడాతో ఓడిపోయింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం (జూలై 29) ఉదయం జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఒక్క మ్యాచ్ లో కూడా పోటీ ఇవ్వకుండానే విండీస్ చేతులెత్తేసింది. ఆశ్చర్యకరంగా ఐదు మ్యాచ్ ల్లో ఆసీస్ ఛేజింగ్ చేసి గెలవడం విశేషం. 

అంతకముందు టెస్ట్ సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసిన ఆస్ట్రేలియా.. టీ20 ఫార్మాట్ లో కూడా అన్ని మ్యాచ్ ల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో సొంత గడ్డపై వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా విమర్శలు మూటగట్టుకుంటుంది. మరోవైపు టీ20 సిరీస్ ను 5-0 తో గెలుచుకున్న ఆస్ట్రేలియా ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పి ఇండియా సరసం చేరింది. ఐసీసీ సభ్యదేశాల్లో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. 2020లో న్యూజిలాండ్ పై ఇండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేస్తే.. తాజాగా ఆస్ట్రేలియా ఈ ఫీట్ రిపీట్ చేసింది. ఓవరాల్ గా మలేషియా, కేమన్ దీవులు, టాంజానియా, స్పెయిన్ జట్లు కూడా ఈ ఘనత అందుకున్నాయి. 

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లో వరుసగా ఐదవసారి ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ షిమ్రాన్ హెట్మెయర్ 31 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. రూథర్‌ఫోర్డ్ కూడా 17 బంతుల్లో 35 పరుగులు చేసి రాణించాడు. ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 17 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. బెన్ ద్వార్షుయిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. కామెరాన్ గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.