
- పెట్రోల్ బంకు దగ్గర గమనించిన సాధారణ పౌరుడి ఫిర్యాదుపై అధికారుల స్పందన
- ఉప ప్రధానితోపాటు.. మాస్కు ధరించని మరో 11 మందికి జరిమానా విధింపు
- ఉప ప్రధానికి 200 డాలర్లు.. (రూ.11 వేలు) జరిమానా విధింపు
కాన్ బెర్రా: అసలే కరోనా కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తుండడం కలవలరపరుస్తోంది. ఈ క్రమంలో అందరికీ మార్గదర్శకంగా నిలవాల్సిన పాలకులే నిబంధనలు పాటించకపోవడం అధికారులకే కాదు.. ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. మా పట్ల కఠినంగా వ్యవహరించే మీరు ఇప్పుడు ఉప ప్రధానే మాస్కు లేకుండా కనిపిస్తున్నాడు కదా అని ప్రశ్నించడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందేనని.. నిబంధనలు పాటించకపోతే సామాన్యుడైనా.. దేశాధ్యక్షుడైనా ఒకటేనని తేల్చి చెప్పారు. మాటలతో కాకుండా జరిమానా విధించి మరీ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు ఆస్ట్రేలియా అధికారులు.
కరోనా కట్టడి విషయంలోనే కిందా మిందా పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా విజృంభిస్తుండడం ఆస్ట్రేలియాలో ఆందోళనకు గురిచేస్తోంది. మళ్లీ థర్డ్ వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా ఉప ప్రధాని బారన్నబీ జోయ్స్ మాస్కు లేకుండా తిరుగుతుంటే కొందరు గమనించారు. పెట్రోలు బంకు సమీపం నుంచి ఓ వ్యక్తి అధికారులకు ఉప ప్రధాని గురించి ఫిర్యాదు చేయగా.. అధికారులు వెంటనే స్పందించారు. ఉప ప్రధాని వెళ్లిన మార్గంలో తనిఖీలు చేయగా మరో 16 మంది మాస్కు పెట్టుకోకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఉప ప్రధానితోపాటు.. మాస్కు లేకుండా కనిపించిన వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు ప్రకటించారు.