క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా

క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా
  • సింగరేణి సీఎండీతో మోనాష్ యూనివర్సిటీ బృందం కీలక భేటీ
  • తమతో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని బృందం విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తమతో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ మోనాష్ యూనివర్సిటీ సింగరేణికి ఆహ్వానం పలికింది. మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్‌‌‌‌లో సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో గల అవకాశాలను వివరించారు. తమ దేశం క్రిటికల్ మినరల్స్ రంగంలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, మైనింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన సింగరేణి సంస్థను కూడా పరస్పర లాభదాయక భాగస్వామ్యం కోసం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా నేడు క్రిటికల్ మినరల్స్‌‌‌‌కు డిమాండ్ ఉందని, ఈ రంగంలో ఆధునిక సాంకేతికత, పర్యావరణ హిత మైనింగ్, లాభదాయక వ్యూహాత్మక వ్యాపార చర్యలపై తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, విద్య, పరిశ్రమల భాగస్వామ్యం, పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరిష్కారాలుగా మార్చడంలో మోనాష్ యూనివర్సిటీకి ఉన్న అనుభవాన్ని ఆ బృందం వివరించింది. అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో కలిసి వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు తెలిపింది.

పవర్‌‌‌‌పాయింట్ ప్రజెంటేషన్..

కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించడానికి చేస్తున్న కృషిని సింగరేణి అధికారులు.. మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు పవర్‌‌‌‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల కర్ణాటకలో బంగారం - రాగి గనుల అన్వేషణను ప్రారంభించామని తెలిపారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో పరస్పర లాభదాయకమైన భాగస్వామ్యం కోసం అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని సింగరేణి సీఎండీ తెలిపారు. మోనాష్ యూనివర్సిటీ - సింగరేణి మధ్య పరిశోధన, ఆధునిక సాంకేతికత, క్రిటికల్ మినరల్స్, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో భవిష్యత్ సహకార అవకాశాలను పరిశీలిస్తామన్నారు. త్వరలో సింగరేణి ఉన్నతస్థాయి అధికార బృందాన్ని ఆస్ట్రేలియాలో అవకాశాల పరిశీలనకు పంపిస్తామని వెల్లడించారు.