కంగారూ బ్యాట్స్‌‌మెన్ జోరు.. భారత్ బౌలర్ల బేజారు

కంగారూ బ్యాట్స్‌‌మెన్ జోరు.. భారత్ బౌలర్ల బేజారు

సిడ్నీ: ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో కదంతొక్కారు. వీరితోపాటు డేవిడ్ వార్నర్ (69), గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ (45) కూడా రాణించడంతో కంగారూ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ ఆసీస్‌‌కు శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ అలవోకగా బౌండరీలు కొడుతూ భారత బౌలర్లపై ఒత్తిడిని పెంచారు. తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ఈ జోడీ డబుల్ సెంచరీ పార్ట్‌‌నర్‌‌షిప్ దిశగా దూసుకెళ్తున్న దశలో వార్నర్‌‌ను షమీ పెవిలియన్‌‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, ఫించ్‌‌కు జత కలిశాడు. ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు.

సెంచరీ కొట్టిన తర్వాత స్మిత్‌‌ను షమీనే వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన స్టొయినిస్ డకౌట్‌‌గా వెనుదిరగ్గా.. లబుషేన్ కూడా 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. అయితే మ్యాక్స్‌‌వెల్, క్యారే రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లలో షమీకి 3 వికెట్ దక్కగా, బుమ్రా, సైనీ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. బుమ్రా 73 పరుగులు సమర్పించుకోగా.. సైనీ, చాహల్ బౌలింగ్‌‌లో కంగారూ బ్యాట్స్‌‌మెన్ 80 రన్స్‌‌కు పైగా పిండుకున్నారు. బౌలర్ల వైఫల్యమే గాక ఫీల్డర్ల తప్పిదాలతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. భారత్ ముందు ఆసీస్ భారీ టార్గెట్‌‌ను ఉంచింది. ఓపెనర్లు, టాపార్డర్‌‌తోపాటు మిడిలార్డర్ కూడా సమష్టిగా రాణిస్తేనే ఈ లక్ష్యాన్ని ఇండియా ఛేజ్ చేయగలుగుతుంది.