IND vs AUS: ఇండియాతో తొలి వన్డేకు జంపా, ఇంగ్లిస్ ఔట్..? రీప్లేస్ మెంట్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

IND vs AUS: ఇండియాతో తొలి వన్డేకు జంపా, ఇంగ్లిస్ ఔట్..? రీప్లేస్ మెంట్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఇండియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న తొలి వన్డేకు ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌ సేవలను ఆసీస్ జట్టు కోల్పోనుంది. జంపా భార్య బిడ్డను జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలో జంపా తండ్రి కాబోతున్నాడు. ఈ కారణంగా ఈ ఆసీస్ స్టార్ స్పిన్నర్ తొలి వన్డేలో ఆడడం లేదు. అయితే సిరీస్ లోని చివరి రెండు వన్డేలకు జంపా అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. జంపా స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్ ను జట్టులోకి తీసుకున్నారు. మాథ్యూ కుహ్నెమాన్ కు తొలి వన్డేలో ప్లేయింగ్ 11 చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.  

మరోవైపు జోష్ ఇంగ్లిస్ ఇంకా గాయం పూర్తిగా కోలుకోలేదు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోనూ ఈ ఆసీస్ వికెట్ కీపర్ గాయం కారణంగా టీ20 సిరీస్ ఆడలేదు. అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరిగే రెండవ వన్డేలో కూడా ఇంగ్లిస్ ఆడబోయేది అనుమానంగా మారింది. అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్న మూడో వన్డేకు ఇంగ్లిస్ ఫిట్‌గా ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది. ఇంగ్లిస్ స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ జోష్ ఫిలిప్‌ను జట్టులోకి చేర్చుకుంది. ఇప్పటికే మ్యాక్స్ వెల్, కమ్మిన్స్ దూరమైనా నేపథ్యంలో జంపా, ఇంగ్లిస్ కూడా అందుబాటులో లేకపోవడం తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియా జట్టును కలవరపెడుతుంది.

అక్టోబర్ 19 నుంచి సొంతగడ్డపై ఇండియాతో జరగనున్న వన్డే సిరీస్ కు స్టార్క్‌‌ బరిలోకి దిగనన్నాడు. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోని  రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరంగా ఉండగా.. ఆల్‌‌రౌండర్ మిచెల్ మార్ష్ కెప్టెన్‌‌గా కొనసాగనున్నాడు. స్టార్క్‌‌తో పాటు అన్‌‌క్యాప్డ్ బ్యాటర్ మాథ్యూ రెన్‌‌షా, మాట్ షార్ట్, మిచ్ ఓవెన్ వంటి ఆటగాళ్లకు కూడా సెలెక్టర్లు వన్డే జట్టులో చోటు కల్పించారు. గాయంతో బాధపడుతున్న  స్టార్ ఆల్‌‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ జట్టుకు దూరంగా ఉండగా.. షెఫీల్డ్‌‌ షీల్జ్‌‌ టోర్నీలో ఆడుతున్న వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు.

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

ఇండియాతో వన్డే సిరీస్ కు జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా