 
                                    ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. బౌలింగ్ లో పర్వాలేదనిపించిన మన జట్టు బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమై సిరీస్ లో వెనకపడ్డారు. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్ లో హేజల్ వుడ్ విజృంభించడంతో పాటు బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్ (46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది.
126 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు.తొలి వికెట్ కు వీరిద్దరూ 4.3 ఓవర్లలోనే 51 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడగొట్టి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. పవర్ ప్లే తర్వాత కూడా మార్ష్ మెరుపులు మెరిపించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 46 పరుగులు చేసిన మార్ష్ తో పాటు సింగిల్ పరుగుతో టిమ్ డేవిడ్ పెవిలియన్ కు చేరాడు.
ఈ రెండు వికెట్లతో ఆస్ట్రేలియా 90 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ విజయానికి చేరువగా వచ్చిన సమయంలో జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, షార్ట్ వికెట్లను కోల్పోయింది. అయితే లక్ష్యం చిన్నది కావడంతో ఇండియా బౌలింగ్ యూనిట్ కూడా ఏమీ చేయలేకపోయింది. ఇండియా బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అభిషేక్, హర్షిత్ తప్పితే అందరూ విఫలం: 
  
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ గిల్ క్రీజ్ లో ఉన్నంత సేపు తడబడి కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. మూడో స్థానంలో సంజు శాంసన్ కు ప్రమోషన్ వస్తే కేవలం రెండు పరుగులకే నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ డకౌటయ్యాడు. దీంతో ఇండియా 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో హేజల్ వుడ్ మూడు వికెట్లు తీసుకొని ఇండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. 
పవర్ ప్లే తర్వాత ఇండియా రనౌట్ రూపంలో అక్షర్ పటేల్ వికెట్ కోల్పోయింది. 49 పరుగులకే సగం జట్టును కోల్పోయిన టీమిండియాను అభిషేక్ శర్మ, హర్షిత్ రానా ఆదుకున్నారు. ఆరో వికెట్ కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టు స్కోర్ ను 100 పరుగుల మార్క్ దాటించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన రానా భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న అభిషేక్ 19 ఓవర్లో ఔట్ కావడంతో ఇండియా కథ ముగిసింది.
Australia win the second T20I by 4 wickets.#TeamIndia will look to bounce back in the next match.
— BCCI (@BCCI) October 31, 2025
Scorecard ▶ https://t.co/7LOFHGtfXe#AUSvIND pic.twitter.com/rVsd9Md9qh

 
         
                     
                     
                    