క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా: 12 నెలల్లో నాలుగు వరల్డ్ కప్ టైటిల్స్

క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా: 12 నెలల్లో నాలుగు వరల్డ్ కప్ టైటిల్స్

క్రికెట్ అంటే ఆస్ట్రేలియా.. ఆస్ట్రేలియా అంటే క్రికెట్. 1990 నుంచి 2010 వరకు దాదాపు రెండు దశాబ్దాలు క్రికెట్ పై ఆసీస్ చెరగని ముద్ర వేసింది. ఒకప్పుడు క్రికెట్ లో కంగారులను ఓడించాలంటే అసాధ్యమనే చెప్పాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ అంత సింపుల్ గా ఓడిపోదు. అయితే ఆ తర్వాత క్రికెట్ లో అన్ని జట్లు బలంగా అవతరించాయి. ముఖ్యంగా భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ ఆసీస్ కు గట్టి పోటీనిచ్చాయి. ఈ క్రమంలో భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి జట్లు ఐసీసీ టైటిల్స్ ను గెలుచుకున్నాయి. ఇదిలా ఉండగా క్రికెట్ పై కంగారూలు మరోసారి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 

ఐసీసీ టైటిల్స్ ఈజీగా గెలిచేస్తున్నారు. సీనియర్ క్రికెటర్లతో పాటు ఆసీస్ మహిళా జట్టు, అండర్ 19 కుర్రాళ్ళు అదే బాటలో పయనిస్తున్నాయి. క్రికెట్ లో ఆస్ట్రేలియా బలమైన జట్టే. కంగారులను ఓడించాలంటే శక్తికి మించి కష్టపడాల్సిందే. అయితే ఇతర దేశాలు కూడా బలహీనంగా ఏమీ లేవు. కానీ నాకౌట్ పోరు వస్తే కంగారుల ముందు తడబడిపోతున్నారు. నాకౌట్ కు వస్తే చాలు టైటిల్ తీసుకెళ్లడం అలవాటైపోయింది. దీంతో ఆసీస్ ముందు ఏ జట్టు నిలవలేకపోతుంది. 

ఒక్క సంవత్సరంలోనే ఆస్ట్రేలియా ఏకంగా 4 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. 2023 ఫిబ్రవరి లో ఆస్ట్రేలియా మహిళల జట్టు సౌతాఫ్రికా మహిళల జట్టును ఓడించి టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత జూన్ లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచారు. ఇక తాజాగా నిన్న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ మూడు ఫైనల్స్ లో భారత్ ప్రత్యర్థి కావడం ఇండియన్ ఫ్యాన్స్ ను బాధకు గురి చేస్తుంది. 

ఒక్క ఐసీసీ టైటిల్స్ సాధించడానికి మిగతా జట్లు అల్లాడిపోతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం చాలా ఈజీగా టైటిల్స్ తీసుకెళ్లిపోతుంది. ఒకప్పుడు క్రికెట్ ను శాసించిన ఆసీస్ మళ్ళీ క్రికెట్ పై దండయాత్ర చేస్తుంది. పాత రోజులను గుర్తు చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తోంది. మహిళా క్రికెటర్లకు సైతం ఎదురు లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఐసీసీ టోర్నీ జరిగినా ఆస్ట్రేలియా ఆట తీరు నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. మరి రానున్న రోజుల్లోనైనా ఆసీస్ దూకుడుకు మిగిలిన దేశాలు అడ్డుకట్ట వేస్తాయి లేదో చూడాలి.