మెల్‌బోర్న్: సీజన్ ఓపెనింగ్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు వేళయింది. ఆదివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీ సరికొత్త సమీకరణాలతో ఆసక్తి రేపుతోంది. మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు ‘సిన్కరాజ్’ (యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్) మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, విమెన్స్‌లో కోకో గాఫ్, సబలెంకా, స్వైటెక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎనిమిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకుని మెన్స్ టెన్నిస్‌ను శాసిస్తున్న టాప్ సీడ్ అల్కరాజ్, డిఫెండింగ్ చాంప్ సినర్ పైనే అందరి దృష్టి ఉంది.
ఈ టోర్నీలోనూ ఇద్దరూ టైటిల్‌పై గురి పెట్టగా.. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను మెల్‌బోర్న్‌లో అయినా అందుకోవాలని సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఆశిస్తున్నాడు. స్పెయిన్ ప్లేయర్ పెడ్రో మార్టినెజ్‌తో జొకో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అల్కరాజ్ తొలి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ వాల్టన్‌తో తలపడనున్నాడు. సినర్ ఫ్రాన్స్‌కు చెందిన హుగో గాస్టన్‌తో పోటీ పడనున్నాడు. 45 ఏండ్ల వీనస్ విలియమ్స్ తన 22వ ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగుతుండటం విశేషం.
