రేపు నాగార్జున సాగర్​ గేట్లు ఖుల్లా!

V6 Velugu Posted on Aug 01, 2021

హాలియా, వెలుగు: మరో రెండ్రోజుల్లో నాగార్జునసాగర్​ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి భారీ వరద వస్తుండడంతో సాగర్​ ప్రాజెక్ట్​ వేగంగా నిండిపోతోంది. రోజూ సగటున 10 అడుగుల చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. ఇదే స్థాయిలో వరద వస్తే సోమవారం నాటికి గేట్లను ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సాగర్​ ప్రాజెక్టుకు 4,54,734 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. నీటిమట్టం 573.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 312.0450 టీఎంసీలకు గానూ 264.8534 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 36,484 క్యూసెక్కులను వదులుతున్నారు. పవర్​హౌస్​ నుంచి 35,284 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తుండగా.. 1,200 క్యూసెక్కులను ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్​పీ)కి వదులుతున్నారు. వరద భారీగా వస్తుండడం.. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోవడంతో ఆగస్టు మొదటి వారంలోనే ఎడమకాల్వ ఆయకట్టుకూ నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. 

గేట్లను పరిశీలించిన అధికారులు

ప్రాజెక్టు నిండుతుండడంతో గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రాజెక్ట్​ 26 రేడియల్​ క్రస్ట్​ గేట్లను ప్రాజెక్ట్​ సీఈ శ్రీకాంత్​ రావు, ఎస్​ఈ ధర్మానాయక్​, ఈఈ సత్యనారాయణ, డీఈ పరమేశ్​, ఏఈఈ కృష్ణయ్యలు పరిశీలించారు. గేట్లు ఎత్తితే లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదమున్నందున.. అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు కలెక్టర్లతో పాటు ఆ జిల్లాల పోలీసు అధికారులను అలర్ట్​ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీశైలానికి ఐదు లక్షలపైన ఇన్​ ఫ్లో

ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల నుంచి 4.78 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. సుంకేశుల నుంచి 53,774 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,31,774 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,920 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఏపీ వైపు ఉన్న కుడిగట్టు పవర్​హౌస్​లో కరెంట్​ తయారీ ద్వారా 30,648 క్యూసెక్కులు, తెలంగాణ వైపున్న ఎడమగట్టు విద్యుత్​ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీరు నదిలోకి విడుదలవుతోంది.   
 

Tagged Authorities, lift, Nagarjunasagar gates, rendezvous, srisailam inflow

Latest Videos

Subscribe Now

More News