వడ్లను అమ్మనీకి పోతే దోచుకుంటున్నారు

వడ్లను అమ్మనీకి పోతే దోచుకుంటున్నారు
  •     రైతు పేరు ఒకరిది.. బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ మరొకరిది
  •     తరుగు పేరిట తీసుకున్న వడ్లకు చెల్లింపులు
  •     రూ. లక్షల్లో నష్టపోతున్న రైతన్నలు
  •     ఈసారైనా అలర్ట్​ అయితే మేలు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్​మిల్లర్లు, సివిల్‌‌ ‌‌సప్లయ్‌‌ ‌‌శాఖ అధికారులు కలిసి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉన్న చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. మళ్లీ వానాకాలం సీజన్‌‌ ‌‌వడ్ల కొనుగోళ్లు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కనీసం ఈసారైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరోసారి రైతులు దగా పడే ప్రమాదం ఉంది.

తరుగు పేరిట దోపిడీ

ప్రభుత్వ రూల్స్​ప్రకారం ఒక వడ్ల బస్తాకు 40.70 కిలోల బరువు తీయాలి. కానీ తాలు పేరిట కొనుగోలు కేంద్రం నిర్వాహకులే అనధికారికంగా రైతులను ఒప్పించి 42, 43 కిలోల చొప్పున తూకం వేసి రైతులకు రశీదు ఇస్తున్నారు. బస్తాకు 1.3 కిలోల చొప్పున క్వింటాల్‌‌‌‌కు 3 కిలోలకు పైగా అదనంగా బరువు జోకి రైస్‌‌‌‌ మిల్లులకు పంపిస్తున్నా.. అక్కడ రైస్‌‌‌‌మిల్లర్లు దింపుకోవడం లేదు. తాలు ఎక్కువగా ఉంది, మట్టి వచ్చింది, నాణ్యతగా లేదని సాకులు చెబుతున్నారు. ఒక లారీకి కనీసం 7 నుంచి 10 క్వింటాళ్లు, డీసీఎం వ్యాన్లు అయితే 3 నుంచి 5 క్వింటాళ్లకు పైగా తరుగు తీయడానికి అంగీకరిస్తేనే వడ్లను దించుకుంటున్నారని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే  చెబుతున్నారు. దీంతో ఎకరం, రెండెకరాల పొలం ఉన్న రైతులు 3 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా తరుగు పేరిట తీసుకున్న వడ్లనే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైస్‌‌‌‌మిల్లర్లు, సివిల్‌‌‌‌ సప్లయ్‌‌ ‌‌శాఖ అధికారులు కలిసి కాజేస్తున్నారు. ఎవరైనా కంప్లైంట్‌‌ ‌‌చేసినా దొరకకుండా వడ్లు అమ్మిన రైతుల పేర్లే నమోదు చేస్తూ బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ కాలమ్‌‌ ‌‌దగ్గర మాత్రం వారి ‌‌లేదా వారికి తెలిసిన వాళ్ల అకౌంట్‌‌ ‌‌నంబర్లు నమోదు చేస్తున్నారు. డబ్బులు పడగానే విడిపించుకొని పంచుకుంటున్నారు.

పట్టించుకోని సర్కారు

గత యాసంగి వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రైస్‌‌‌‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలిసి తరుగు పేరిట దోచుకుంటున్న విషయంపై రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్దార్‌‌ ‌‌ఆఫీసులను ముట్టడించి, రాస్తారోకోలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇది చిన్న విషయంగానే పరిగణించింది. రైతులకు దక్కాల్సిన సొమ్మును దళారులు ఎలా కాజేస్తున్నారనే విషయంపై లోతుగా విచారణ జరపలేదు. దీనివల్ల ప్రతి సీజన్‌‌‌‌లో రూ.వందల కోట్ల నిధులు దళారుల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడన్నీ చిన్న జిల్లాలే. ప్రతి జిల్లాలో కలెక్టర్, జాయింట్‌‌ ‌‌కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి(డీఎస్‌‌‌‌వో) వంటి ఉన్నతాధికారులు ఉన్నారు. వీళ్లంతా దృష్టి సారిస్తే రైతుల సమస్యలు పరిష్కరించవచ్చు. తరుగు పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టవచ్చు.

వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో లోపాలు

రాష్ట్ర ప్రభుత్వం సివిల్‌‌ ‌‌సప్లయ్‌‌ ‌‌శాఖ ద్వారా ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌‌‌‌లలో వడ్ల కొనుగోళ్లను జరుపుతుంది. ఇందుకోసం ఏటా రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. వడ్ల కొనుగోళ్లకు ఓపీఎంఎస్‌‌‌‌ ద్వారా జిల్లాల వారీగా సివిల్‌‌ ‌‌సప్లయ్‌‌ ‌‌శాఖ జిల్లా మేనేజర్‌‌ ‌‌ఆధ్వర్యంలో ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు యూజర్‌‌ ‌‌నేమ్‌‌‌‌, పాస్‌‌‌‌వర్డ్‌‌ ఇచ్చింది. వడ్లు అమ్మిన రైతుల వివరాలను ఈ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో నమోదు చేస్తేనే వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమవుతాయి. రైతు ఆధార్‌‌, పట్టాదారు పాస్‌‌‌‌బుక్‌‌‌‌, బ్యాంకు ఖాతా వివరాలు ఇందులో నమోదు చేస్తారు. బ్యాంకు ఖాతా లేని రైతులకు వారి కుటుంబ సభ్యుల ఖాతాలో పేమెంట్‌‌ ‌‌చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఇదే దళారులకు వరంగా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతు పేరొకరిది.. బ్యాంకు అకౌంట్‌‌‌‌ మరొకరిది నమోదు చేసి రైతుల సొమ్మును దోచుకుంటున్నారు. రైతుబంధు పథకం వల్ల ప్రతీ ఒక్క రైతుకూ ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఉంది. అయినా అధికారులు వెబ్‌‌‌‌సైట్‌‌ ‌‌తొలినాళ్లలో పెట్టిన రూల్​మాత్రం తొలగించలేదు.