శామీర్ పేటలో రోడ్డుపై గోడను కూల్చివేసిన అధికారులు

శామీర్ పేటలో రోడ్డుపై గోడను కూల్చివేసిన అధికారులు
  • ముఖ్యమంత్రికి ఆరెంజ్ బౌల్ విల్లావాసులు కృతజ్ఞతలు

శామీర్ పేట, వెలుగు:  ఎట్టకేలకు రోడ్డుపై గోడను అధికారులు కూల్చివేసి ఆరెంజ్ బౌల్ విల్లా వాసులకు రోడ్డు సౌకర్యం కల్పించారు. శామీర్ పేట సమీపంలోని దర్గా బస్టాప్ ఎదురుగా సెలబ్రిటీ రిసార్ట్ మీదుగా ఆరెంజ్ బౌల్ రిసార్ట్స్ లోకి వెళ్లేందుకు రోడ్డు ఉండేది. అందులో  1200 ప్లాట్లలో వెయ్యి కుటుంబాలు 25 ఏండ్లుగా ప్రయాణిస్తుండగా.. ఏడాది కిందట జయరెడ్డి, రాజవెంకటరెడ్డి, మహేశ్వర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల అండతో రోడ్డుపై ప్రహరీని నిర్మించారు. 

దీంతో సెలబ్రిటీ విల్లా ఓనర్స్ సొసైటీ నేతలు రాజశేఖరయ్య , శ్రీ రంగారావు అశోక్ బలవంత రెడ్డి ఏడాదిగా అధికారుల వద్దకు తిరుగుతూ పోరాడుతూ.. చివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ రోడ్డు సమస్యను విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి ఆదేశాలు ఇవ్వగా.. శుక్రవారం కలెక్టర్ గౌతమ్ సూచనలతో శామీర్ పేట పంచాయతీ కార్యదర్శి మౌనిక సిబ్బందితో వెళ్లి పోలీసుల బందోబస్తు నడుమ రోడ్డుపై గోడ కూల్చివేయించారు. దీంతో సెలబ్రిటీ రిసార్ట్ విల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తూ.. సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రికి, కలెక్టర్ ను కృతజ్ఞతలు తెలిపారు.