గోవిందా.. గోవిందా.. ఈ నామమే కోటాను కోట్ల మంది భక్తులకు కొంగుబంగారం. సెలవు వస్తే చాలు తిరుమల వేంకన్న దర్శనం కోసం పరుగులు తీస్తారు భక్తులు. అలాంటిది వరసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.. ఈ క్రమంలోనే తిరుమల కొండ భక్త జన సంద్రంగా మారింది. సాధారణ భక్తుల విషయంలో ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం.. 2025, డిసెంబర్ 25వ తేదీ ఉదయం జరిగిన ఘటన మాత్రం శ్రీవారి భక్తులను కలిచి వేసింది.
మరీ ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. 10 వేల 500 రూపాయలు చెల్లించి తీసుకునే శ్రీవాణి టికెట్ల కోసం.. భక్తులు ఆందోళన చేయాల్సిన దుస్థితి కొండపై ఏర్పడింది. వణికిపోయే చలిలో.. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు.. తెల్లవారుజామున 4 గంటలకే 10 వేల 500 రూపాయల శ్రీవాణి టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలో ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేయలేదు. 10, 20, 30 నిమిషాలు వెయిట్ చేశారు భక్తులు. ఉదయం 5 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేయలేదు. భద్రతా సిబ్బంది, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారా లేదా అన్న సమాచారం కూడా లేకపోవటంతో భక్తులు నిరసనకు దిగారు.
పిల్లాపాపలతో.. వృద్ధులతో కొండకు వచ్చాం.. శ్రీవారి దర్శనంతో స్వామిసేవలో తరించాలని వస్తే.. అధికారుల నిర్లక్ష్యంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి.. పరిస్థితులు కొండపై ఉన్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై.. శ్రీవారి టికెట్ కౌంటర్ల ఎదుట రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు.
శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు ఆందోళనలు చేస్తున్నారన్న సమాచారంతో టీటీడీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు భక్తులతో మాట్లాడారు. అప్పటికీ భక్తులు శాంతించలేదు. ఈ క్రమంలోనే టీడీపీ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి శ్రీవాణి టికెట్ కోసం వేచి ఉన్న భక్తులతో.. ఆందోళన చేస్తున్న భక్తులకు సర్దిచెప్పి.. ఆందోళన విరమింపజేశారు.
ఒక్కో శ్రీవాణి టికెట్ ధర 10 వేల 500 రూపాయలు. ఈ టికెట్ల జారీలోనూ సరైన సమయపాలన లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వస్తే సరైన సమాధానం లేదని.. కౌంటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు.. ఎన్ని గంటలకు టికెట్లు ఇస్తారనే సమాచారం లేకపోవటం ఏంటని అధికారులను నిలదీశారు భక్తులు. కొండపై భక్తుల ఆందోళనకు దిగటం.. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకోవటం అనేది తిరుమల చరిత్రలోనే ఫస్ట్ టైం అన్నట్లు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా మేల్కొంటారో లేదో చూడాలి.
టీటీడీ వివరణ :
భక్తుల ఆందోళనపై టీటీడీ వివరణ ఇచ్చింది. అర్థరాత్రి 2 గంటలకే శ్రీవాణి టికెట్ల జారీ జరిగిందని.. అప్పుడే ఇచ్చేశామని స్పష్టం చేసింది. ఈ విషయం ఈ విషయం భక్తులకు తెలియకపోవటం.. కౌంటర్ల దగ్గర ఎవరూ చెప్పకపోవటంతో భక్తులు ఆందోళన చేశారని వివరించారు టీటీడీ అధికారులు.
