- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పాల్గొననున్న క్రీడాకారులు
నిజామాబాద్, వెలుగు : కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఇందూర్ గడ్డపై ప్రారంభం కానుంది. నగరంలోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 9 గంటలకు మొదలయ్యే పోటీల్లో నిజామాబాద్ నుంచి రెండు జట్లు, కామారెడ్డి జిల్లా నుంచి రెండు జట్లు పాల్గొంటాయి. ఫైనల్ టోర్నమెంట్ శుక్రవారం ముగించి గెలిచే టీంను స్టేట్ లెవెల్‌కు ప్రమోట్ చేస్తారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి.
నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి పోటీలు ప్రారంభించనుండగా శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జరిగే ముగింపు వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రానున్నారు. విన్నర్, రన్నర్లతో పాటు ఆటలో ప్రతిభ చూపే క్రీడాకారులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందించనున్నారు.
