కట్ట పనులు పూర్తి కాలే..పరిహారం ఇయ్యలే

కట్ట పనులు పూర్తి కాలే..పరిహారం ఇయ్యలే
  • కట్ట పనులు పూర్తి కాలే..పరిహారం ఇయ్యలే..
  • అయినా ‘గౌరవెల్లి’ ట్రయల్ ​రన్​ 
  • అడ్డుకుంటామంటున్న నిర్వాసితులు

సిద్దిపేట, వెలుగు :  నిర్వాసితుల ఆందోళనలను లెక్క చేయకుండా హుస్నాబాద్ ​నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. గుడాటిపల్లి వద్ద రిజర్వాయర్ కట్ట పనులు నిలిచిపోయినా ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీన్ని అడ్డుకుంటామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద  గౌరవెల్లి రిజర్వాయర్​ను 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొదట 1.4 టీఎంసీల కెపాసిటీతో కట్టాలని అనుకున్నా రీ డిజైన్ చేయడంతో 10.5 కిలోమీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు, 42 మీటర్లతో ఎత్తుతో రిజర్వాయర్​కట్టను నిర్మించాల్సి వచ్చింది. ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.  అయితే పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ ​చేయకుండా ట్రయల్​రన్​కు డేట్​ ఫిక్స్​ చేయడంతో అధికారులు తమను రెచ్చగొట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని  నిర్వాసితులంటున్నారు.  


ఆరు నెలలుగా దీక్షలు : 


ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమకు న్యాయం చేయకుండా ప్రభుత్వం పనులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వడంతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాకే ట్రయల్​రన్​ చేసుకోవాలంటున్నారు. గుడాటిపల్లిలోని 500 మంది యువకులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నారు. పాత డిజైన్ ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మిస్సయిన 111 మందికి న్యాయం చేయాలంటున్నారు. నిర్వాసితుల ఇండ్లకు పరిహారం ఇచ్చినా చుట్టుపక్కల కోల్పోయిన ఖాళీ జాగలకు పరిహారం ఇవ్వలేదంటున్నారు. కొత్త డిజైన్ ప్రకారం గిరిజన తండాల్లోని 187 కుటుంబాలకు అన్యాయం జరిగిందంటున్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ లో దీక్షలు మొదలుపెట్టారు.  గుడాటిపల్లి వద్ద అధికారులు కట్ట నిర్మాణ పనులను ప్రారంభించడంతో అడ్డుకుని అక్కడే దీక్షలు ప్రారంభించారు. వంటా వార్పుతో పాటు ఇతర పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారు.  ఈ నేపథ్యంలో ట్రయల్​రన్ ​ప్రకటనతో ఆందోళన చెందుతున్నారు. 


ప్రాణత్యాగానికైనా సిద్ధం :


కోహెడ : ట్రయల్ రన్ ప్రకటనతో శుక్రవారం ప్రాజెక్టు వద్ద సర్పంచ్​ బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు నిరసన తెలిపారు. ట్రయల్​ రన్​ వద్దు..పరిహారాలు ముద్దు అంటూ నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని, పోలీసులను అడ్డుపెట్టుకొని ట్రయల్ రన్  నిర్వహించాలని చూస్తే ప్రతిఘటన తప్పదంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పునరాలోచన చేసినట్టు తెలుస్తున్నది. ట్రయల్​ రన్​ ఉండేది లేదని శనివారం రాత్రి చెబుతామంటున్నారు. కాగా, అధికార పార్టీ లీడర్లు మాత్రం ట్రయల్ రన్ వాయిదా పడిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పరిహారాలిచ్చాకే ట్రయల్ రన్ చేయాలి  గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చిన తర్వాతే ట్రయల్ రన్ నిర్వహించాలి. ఆరు నెలలుగా గుడాటిపల్లివాసులు ఆందోళన చేస్తుంటే అధికారులు స్పందించలేదు. ఇప్పుడు ట్రయల్​ రన్​ నిర్వహిస్తామంటున్నారు. పునరాలోచన చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.      

– దూది శ్రీకాంత్ రెడ్డి, బీజెపి జిల్లా అధ్యక్షుడు
 

మమ్మల్ని రెచ్చగొడుతున్నారు


గౌరవెల్లి ప్రాజెక్టు మూలంగా ఇండ్లు, భూములు కోల్పోయిన గుడాటిపల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.   2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించి ప్రతి నిర్వాసితుడికి డబుల్ బెడ్​రూం ఇంటితో పాటు 18 ఏండ్లు నిండిన వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారాలే ఇవ్వాలి. గతంలో 1200 రోజుల పాటు దీక్షలు చేశాం. ఆరు నెలలుగా నిరవధిక దీక్షలు చేస్తున్నా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. ఇప్పుడు ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించి    మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. 


– బద్దం రాజిరెడ్డి,  గుడాటిపల్లి, సర్పంచ్