
- క్లాసులు బహిష్కరించి స్టూడెంట్ల నిరసన
- నలుగురు ఎస్జీసీ విద్యార్థి నాయకులపై కేసులు
- బాసర ట్రిపుల్‌ఐటీలో చల్లారని ఉద్రిక్తత
భైంసా/బాసర/డిచ్పల్లి, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అనుమతి లేకుండా స్టూడెంట్లెవరూ సమావేశాలు నిర్వహించొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఈ మేరకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. దీంతో వర్సిటీలో తమపై నిర్బంధం, ఆంక్షలు ఏమిటంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే హాస్టల్ రూంలలో తప్ప.. క్యాంపస్ పరిసరాల్లో, క్లాస్ రూంలలో సెల్ ఫోన్ లు వాడొద్దంటూ ఆంక్షలు విధించారు. తాజాగా మీటింగ్ లూ పెట్టుకోవద్దనడం, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న నలుగురు స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వర్సిటీ క్యాంపస్ లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
చల్లారని ఆందోళనలు
మంగళవారం ట్రిపుల్ఐటీ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ఇయర్ విద్యార్థి రాథోడ్ సురేష్ ఆత్మహత్యకు పాల్పడడంతో మొదలైన ఆందోళన, బుధవారం కూడా కంటిన్యూ అయింది. ట్రిపుల్ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో బంద్ పాటించి తరగతులను బహిష్కరించారు. విద్యార్థులంతా హాస్టల్ గదులకే పరిమితం కావడంతో క్యాంపస్ నిర్మానుష్యంగా మారింది. సాయంత్రం మృతుడు సురేష్ కు సంతాపం తెలిపేందుకు విద్యార్థులు పెద్దసంఖ్యలో సమావేశం అయ్యారు. సెల్‌ఫోన్ లైట్లతో ర్యాలీ తీసి మృతునికి నివాళులర్పించారు. అయితే, మంగళవారం పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఎస్జీసీ లీడర్లు మాదేశ్, శ్రీనివాస్, సాయిచరణ్, ప్రశాంత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 353, 332, 427, 34, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలియడంతో ర్యాలీలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. వర్సిటీలో బుధవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితులే కనిపించాయి.
సురేష్ అంత్యక్రియలు పూర్తి
బాసర ట్రిపుల్ ఐటీ లో సూసైడ్ చేసుకున్న రాథోడ్ సురేష్ నాయక్ అంత్యక్రియలు అతని స్వగ్రామం డిచ్పల్లి తాండలో బుధవారం జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించారు. తెలంగాణ యూనివర్సిటీలో వివిధ స్టూడెంట్స్ సంఘాల లీడర్లు క్లాసులు బహిష్కరించి బంద్ పాటించారు. సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సురేష్ సూసైడ్ పై సమగ్ర విచారణ చేపట్టాలని, ఫ్యామిలీ కి రూ.కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో అర్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌చేశారు.