
మెదక్ (శివ్వంపేట), వెలుగు: అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శివ్వంపేట మండల రెవెన్యూ ఆఫీసర్లు వత్తాసు పలుకుతున్నారని, ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి తెలిపారు. మండల కేంద్రంలోని సికింద్లాపూర్ పిట్టల వాడకు వెళ్ళే దారిని అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో కొందరు భూమిని కబ్జాచేసి చుట్టూ గోడ కట్టారని, రోడ్డును ధ్వంసం చేస్తున్నారని తెలిపాడు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్లను కబ్జా చేస్తున్నరెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నల్ల రవిగౌడ్, సికింద్లాపూర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు చారి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి హరిగౌడ్, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రహీమ్ ఖాన్, సికింద్లాపూర్ బూత్ అధ్యక్షుడు లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను సక్సెస్చేయాలి
సంగారెడ్డి టౌన్ ,వెలుగు:హైదరాబాద్ లోని ఓయూ లో ఈనెల 13 నుంచి 16వ జరిగే ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను సక్సెస్ చేయాలని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్ నుంచి న్యూ బస్టాండ్ వరకు 2కే రన్ నిర్వహించారు. మాట్లాడుతూ విద్యార్థులు , విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం కోసం ఓయూలో మహాసభలు ఏర్పాటు చేశామన్నారు. మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రమ్య ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల మహేశ్, నాయకులు మాణిక్యం, పాండు, శివ సుభాశ్, దత్తు, కృష్ణ, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ఫండ్స్ వచ్చినా పనులు చేయరా?
అఖిల పక్షం ఆధ్వర్యంలో అధికార పార్టీ జడ్పీటీసీ పాదయాత్ర
మెదక్ (నిజాంపేట), వెలుగు: ఆఫీసర్ల నిర్లక్ష్యంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్, బీజేపీ నాయకులతో కలసి మండల పరిధిలోని రాంపూర్ నుండి నస్కల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ... నస్కల్–- నిజాంపేట రోడ్డు రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని, అధికారులు రిపేర్లు చేస్తలేరని తెలిపారు. రోడ్డు అభివృద్ధి కోసం గత జనవరి నెలలో రూ.1.40 కోట్లు మంజూరుకాగా ఏడాది అవుతున్నా పనులు ప్రారంభించలేదని తెలిపారు. రూలింగ్ పార్టీలో ఉన్న తామే పోరాటాలు చేసి - నిజాంపేట రోడ్డు శాంక్షన్ చేయిస్తే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి 15 రోజుల్లో రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని, లేకపోతే రోడ్డును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ లింగం గౌడ్, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాజు, చల్మెడ సర్పంచ్ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, అఖిలపక్షం నాయకులు శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల అభివృద్ధికి రూ. 95 కోట్లు శాంక్షన్
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 95 కోట్లు శాంక్షన్ అయ్యాయని, వివిధ రోడ్లు క్వాలిటీగా నిర్మించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో ఎటువంటి రోడ్లు నిర్మించ లేదని కాగా కొందరు కాంట్రాక్టర్లయితే టెండర్ వేసిన తర్వాత చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పరమేశ్, నాయకులు రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెళ్లి మల్లికార్జునస్వామికి మొక్కలు చెల్లించేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో నిండాయి. క్యూలైన్ లో వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. కేశకాండన, అభిషేకం, నిత్యకల్యాణం, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి, తిరుగుడు కోడెలు కట్టి, పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొమురవెల్లి మల్లన్నను రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ పర్యవేక్షించారు.
- వెలుగు ,కొమురవెల్లి
కిటకిటలాడిన ఏడుపాయల
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం బారులుతీరారు.భక్తులు ఎక్కువ ఉండడంతో దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ సిబ్బంది, పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
- వెలుగు ,పాపన్నపేట