ఆత్మహత్య చేసుకుంటానంటూ సీఎం కు లెటర్

ఆత్మహత్య చేసుకుంటానంటూ సీఎం కు లెటర్

ఆత్మహత్య చేసుకుంటానంటూ సీఎం కేసీఆర్ కు లెటర్ రాసి, ఆపై సెల్ఫీ వీడియో తీసి తన ముగ్గురు పిల్లలతో అదృశ్యమయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ లోని తార్నాక లో జరిగింది. వివరాల ప్రకారం..  తార్నాకలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మల్లారెడ్డి..  తన భూమికి సంబంధించిన పట్టా ఇవ్వడానికి మండల కార్యాలయ అధికారులు మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారని మనస్థాపానికి గురయ్యాడు. సర్వే ప్రకారం పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో తన తండ్రి నుంచి  వచ్చిన భూమిని  తనకు చెందేలా పట్టా ఇవ్వడానికి ఆ గ్రామ VAO, VRO  తిప్పించుకుంటున్నారని వాపోతూ సీఎం కేసీఆర్ కు లెటర్ రాశాడు.

తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ  ఓ సెల్ఫీ వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఆ తర్వాత తన ముగ్గురు పిల్లల ( ప్రశాంతి (10), శ్రీ వాణి (8), మణికంఠ జ్ఞానేశ్వర్ రెడ్డి (6) )కు చెప్పులు కొనిస్తానని ఇంట్లో తన భార్యకు చెప్పి ఉదయం 10 గంటల సమయంలో ముగ్గురు పిల్లలతో కలసి ఆటోలో వెళ్లాడు. లెటర్ గమనించిన భార్య సరిత తన భర్తను, పిల్లల్ని కాపాడాలని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. అతని ఆచూకీ కోసం నగరమంతా గాలించి చివరకు భువనగిరి వద్ద అతనితో పాటు ముగ్గురు పిల్లలని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ నలుగురు పోలీసుల సంరక్షణలో ఉన్నారు.